Begin typing your search above and press return to search.

టీడీపీ-బీజేపీల‌ది భార్య‌భ‌ర్త‌ల బంధం

By:  Tupaki Desk   |   10 Sep 2016 5:39 AM GMT
టీడీపీ-బీజేపీల‌ది భార్య‌భ‌ర్త‌ల బంధం
X
బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి - ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్య‌వ‌హ‌రాల‌ ఇన్‌ ఛార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్ ప్ర‌త్యేక హోదా విష‌యంలో మ‌రోమారు స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ బంధంపై ప్రతిపక్షాలు - మీడియా లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని మండిప‌డ్డారు. టీడీపీ-బీజేపీల‌ది భార్యాభర్తల సంబంధం వంటిదని సింగ్ విశ్లేషించారు. ఈ బంధాన్ని విడదీసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని సిద్ధార్థ‌నాథ్ సింగ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. టీడీపీ-బీజేపీ 2019 తర్వాత కూడా కలిసే పని చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు వస్తాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచారం మొదలు పెడతామని సిద్ధార్థ‌నాథ్ సింగ్‌ తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సిద్దార్థనాథ్ సింగ్‌ మండిపడ్డారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని, అయితే లోక్‌ సభలో విభజన చట్టం తీసుకు రాలేక పోయిందని విమర్శించారు. హోదా విషయాన్ని చట్టంలో కాంగ్రెస్‌ ఎందుకు పెట్టలేదని ప్రశ్నింసిన సింగ్ ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని విమర్శించారు. ప్ర‌త్యేక హోదాపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని నాయకులు - కార్యకర్తలకు సింగ్‌ సూచించారు. కేంద్రం రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషిపై అవగాహన పెంచుకోవాలన్నారు. 13వ ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాలకు 32శాతం నిధులు ఇవ్వాలని, అయితే ఎవరూ అడగకుండానే 42 శాతం నిధులు రూ.2.25 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు.

ఇప్పటివరకు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని - 2017 నాటికి పూర్తవుతుందని సింగ్ చెప్పారు. ఆపై ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వడంలేదన్నారు. 14వ ఆర్థిక సంఘంలో రాష్ట్రాల మధ్య తారతమ్యాలు లేకుండా సమానంగా చూడాలనే ప్రతిపాదనను అన్ని పార్టీలు తీర్మానించాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు ఒక్కోదానికి రూ.50 కోట్లు ప్రకారం మూడేళ్లు అభివృద్ధి పథకాలకు ఇస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం 70 శాతం, రాష్ట్రం 30 శాతం నిధులివ్వాల్సి ఉండగా.. రాష్ట్ర ఆర్థిక లోటును దృష్టిలో పెట్టుకుని పూర్తిగా కేంద్రం భరిస్తుందని ప్ర‌ధాన‌మంత్రి ప్రకటించిన విషయాన్ని సింగ్‌ గుర్తు చేశారు.

ఇదిలాఉండ‌గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి హరిబాబు త‌మ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా స‌వాల్ విసిరారు. ఏపీకి కేంద్రం చేస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ల లేకపోతున్నామని చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి కాంగ్రెస్‌ పదేళ్లలో చేసిన సాయంపై చర్చకు సిద్ధమన్నారు. ఏపీకి జీవన రేఖ అయిన‌ పోలవరాన్ని నిర్మించి తీరుతామన్నారు. రైల్వే జోన్‌ వైజాగ్‌ లోనే ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. పార్టీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించి సాయం వల్ల ఏపీకి కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తారన్నారు.