Begin typing your search above and press return to search.

పంజాబ్ సీఎంపై సిద్ధూ సంచలన కామెంట్స్

By:  Tupaki Desk   |   2 Nov 2021 2:34 PM GMT
పంజాబ్ సీఎంపై సిద్ధూ సంచలన  కామెంట్స్
X
కాంగ్రెస్ పంజాబ్ శాఖలో అంతర్గత కుమ్ములాటలు ఎన్ని రోజులైనా కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం చరణ్‌ జిత్ సింగ్ చన్ని ప్రభుత్వం తాజాగా ప్రకటించిన తాయిలాలపై పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు తాయిలాలు ఇవ్వడమేమిటని నిలదీశారు. పంజాబ్ సంక్షేమం ఓ రోడ్‌ మ్యాప్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, ఇటువంటి వ్యూహాల వల్ల కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చన్ని ప్రభుత్వం ఇటీవల ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల కరవు భత్యాన్ని 11 శాతం పెంచింది.

గృహ వినియోగదారులకు విద్యుత్తు ఛార్జీల్లో ఒక్కొక్క యూనిట్‌ కు రూ.3 చొప్పున తగ్గించింది. ఈ నేపథ్యంలో చండీగఢ్‌ లో సంయుక్త హిందూ మహాసభ సమావేశంలో సిద్ధూ మాట్లాడుతూ, ప్రభుత్వ పదవీ కాలం ముగియడానికి రెండు నెలల ముందు తాయిలాలు ఇవ్వడమా అని ప్రశ్నించారు. ఈ తాయిలాలను ఎక్కడి నుంచి ఇస్తారనేదే ప్రశ్న అన్నారు. అబద్ధాలు చెప్పి, తప్పుడు వాగ్దానాలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమా, అని నిలదీశారు. పంజాబ్ సంక్షేమం ఓ రోడ్‌ మ్యాప్ ద్వారా సాధ్యమవుతుందన్నారు.

ఉచితంగా తాయిలాలు ఇస్తామని ప్రకటించి ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించవద్దని రాజకీయ నాయకులకు సలహా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఉండే ఎజెండాను చూసి ఓట్లు వేయాలని ప్రజలను కూడా కోరారు. పంజాబ్‌ కు రూ.5 లక్షల కోట్ల మేరకు అప్పు ఉందన్నారు. ఈ అప్పును రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుందని ప్రజలు భావిస్తే, అది తప్పు అవుతుందన్నారు. ఆ భారాన్ని ప్రజలే మోయవలసి ఉంటుందని చెప్పారు. ఖజానాలో సొమ్ము అధికంగా ఉంటే టీచర్ల నెల జీతాన్ని రూ.50 వేలకు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు.