Begin typing your search above and press return to search.

ఏడాది న‌ష్టం.. ఆరేళ్ల యోగం

By:  Tupaki Desk   |   16 Nov 2021 9:13 AM GMT
ఏడాది న‌ష్టం.. ఆరేళ్ల యోగం
X
ఎంతో క‌ష్టప‌డి సివిల్ స‌ర్వీసెస్ ఉద్యోగం సంపాదించి ఉన్న‌త పోస్టుల్లో ఉన్న వ్య‌క్తులు త‌మ బాధ్య‌త‌ల‌కు రాజీనామా చేసి రాజ‌కీయ పార్టీల్లో చేర‌డం సాధార‌ణ‌మైపోతుంది. ఇక ఐఏఎస్ అధికారులైతే ఓ జిల్లా పాల‌నా వ్య‌వ‌హారాల‌ను వ‌దిలి పెట్టి రాజ‌కీయ యోగం కోసం పార్టీల్లో చేరుతుండ‌డం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి వెంక‌ట్రామిరెడ్డి వ‌చ్చి చేరారు. తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో సిద్ధిపేట క‌లెక్ట‌ర్‌గా ఉన్న ఆయ‌న త‌న ఉద్యోగానికి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకుని మ‌రీ టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కాబోతున్నారు.

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోలాహ‌లం మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా కింద ఆరు స్థానాల‌కు, స్థానిక సంస్థ‌ల కోటా కింద 12 స్థానాలకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొద‌ట ఎమ్మెల్యే కోటా స్థానాల ఎన్నిక ప్రక్రియ ముగించ‌నున్నారు. నామినేష‌న్లు కూడా ఈ రోజుతో ముగుస్తున్నాయి. ఆ ఎమ్మెల్సీ ప‌ద‌వుల కోసం కేసీఆర్ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. బండా ప్ర‌కాశ్‌, క‌డియం శ్రీహ‌రి, త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్‌రావు, కౌశిక్‌రెడ్డి, గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డితో పాటు వెంక‌ట్రామిరెడ్డికి అవ‌కాశం ద‌క్కింది. శాస‌న స‌భ‌లో టీఆర్ఎస్‌కే బ‌లం ఉంది కాబ‌ట్టి వెంక‌ట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయిపోయిన‌ట్లే.

గ్రూప్ వ‌న్ అధికారిగా ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉద్యోగం పొందిన వెంక‌ట్రామిరెడ్డి ఆ త‌ర్వాత ఐఏఎస్ సాధించారు. కేసీఆర్‌ను న‌మ్ముకున్న ఆయ‌న ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోనే ఉండిపోయార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఆయ‌న‌పై ఎన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా కేసీఆర్ కూడా ప‌ట్టించుకోలేద‌ని స‌మాచారం. ఇక ఇటీవ‌ల క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాల ఆరంభోత్స‌వం సంద‌ర్భంగా కేసీఆర్ కాళ్ల‌కు ఆయ‌న దండం పెట్ట‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో ఆయ‌న చివ‌రికి టీఆర్ఎస్‌లోనే చేర‌తార‌నే ప్ర‌చారం అప్పుడే ఊపందుకుంది. ఇప్పుడిక ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అదే నిజ‌మైంది. మ‌రో ఏడాది స‌ర్వీస్ ఉన్న‌ప్ప‌టికీ క‌లెక్ట‌ర్ ప‌ద‌వికి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఆయ‌న‌.. కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కానున్నారు. ఒక్క ఏడాది స‌ర్వీస్ పోతే పోయింది కానీ.. ఇప్పుడు ఆరేళ్ల ఎమ్మెల్సీ యోగం ఆయ‌న‌కు ప‌డుతుంది. ఇక ఎమ్మెల్సీ చేయ‌డ‌మే కాకుండా ఆయ‌న్ని మంత్రివ‌ర్గంలోకి కేసీఆర్ తీసుకుంటార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.