Begin typing your search above and press return to search.

ఆ విషయంలో హరీష్ దేశంలోనే ది బెస్ట్

By:  Tupaki Desk   |   3 Oct 2015 9:03 AM GMT
ఆ విషయంలో హరీష్ దేశంలోనే ది బెస్ట్
X
కేసీఆర్ పెద్దగా నోరేసుకుని పడిపోతూ.. రాజకీయ ప్రత్యర్థులను ఆడుకుంటూ ఉంటారు గానీ.. నిజంగానే ప్రత్యర్థులకు బెంబేలెత్తే స్థాయిలో అంశాల వారీగా విపులంగా విమర్శలు గుప్పించడంలో కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు అందె వేసిన చేయి అని చెప్పుకోవాలి. కేవలం రాజకీయ విమర్శలను తీవ్రస్థాయిలో గుప్పించడంలో మాత్రమే కాదు. తన సొంత నియోజకవర్గ ప్రజల సంక్షేమం విషయంలో కూడా ఆయన ఇతరులకంటె చాలా యాక్టివ్ అని పలువురు అంటుంటారు. నిజానికి ఆయన్ను నియోజకవర్గంలో ‘కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే’ అని పిలుస్తూ ఉంటారుట. కాయిన్ బాక్స్ నుంచి ఫోను చేసినా ఎమ్మెల్యే పలికి, సమస్యను పరిష్కరిస్తాడని అక్కడి ప్రజలకు ఒక అపారమైన నమ్మకం. అందుకే ఆయన తిరుగులేని మాస్ లీడర్ కూడా అయ్యారు. అయితే తన నియోజకవర్గ పరిధిలో ఒక అచీవ్ మెంట్ ద్వారా హరీష్ రావు.. దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచారు. వివరాల్లోకి వెళితే..

సంకల్పం ఉంటే, ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి నేతలకు ఉంటే అద్భుతాలు జరుగుతాయనడానికి ప్రస్తుతం సిద్ధిపేట యావద్దేశానికే ఉదాహరణగా నిలుస్తోంది. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించిన మెదక్ జిల్లా సిద్ధిపేట నియోజక వర్గం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. ఈ గొప్ప మార్పుకు, చరిత్రకు కారణం సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గ సభ్యుడు, మంత్రి హరీష్ రావు కారణభూతులయ్యారు.

సిద్ధిపేట నియోజకవర్గంలో 64,733 నివాస గృహాలు ఉన్నాయి. వీటిలో 58,202 గృహాలకు ఇప్పటికే మరుగుదొడ్డి సౌకర్యం ఉండగా స్వచ్ఛభారత్ - స్వచ్ఛ తెలంగాణలో భాగంగా కేవలం నెల రోజుల్లోపే మిగిలిన 5,531 గృహాలకు మరుగుదొడ్లను నిర్మించి వందశాతం లక్ష్యాన్ని సాధించిన తొలి నియోజకవర్గంగా సిద్ధిపేట రికార్డు సాధించింది. ఈ ఘనతను సాకారం చేయడానికి హరీష్ రావు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. స్వయంగా పార చేతబట్టి, మేస్త్రీ అవతారమెత్తి మరుగుదొడ్ల నిర్మాణం వైపుకు ప్రజలను ప్రేరేపించడంలో, అధికారులను తన వెంట తరమటంలో మంత్రి హరీష్ రావు పడ్డ శ్రమకు ఫలితం లభించిందని యావత్ తెలంగాణ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అంతా బాగుంది. కానీ మనం వేసుకోవలసిన ప్రశ్న ఏదంటే .. దేశంలో ఏ నేతకూ సాధ్యం కాని పని హరీష్ రావుకు మాత్రమే ఎలా సాధ్యం అయిందన్నదే. సిద్ధిపేట ప్రజలకు అందవలసిన ప్రయోజనాలను అందివ్వడంలో గత 15 ఏళ్లుగా ఆయన చేసిన నిర్విరామ శ్రమ ఇలా సాకారమవుతోంది. ఈ సంకల్పం, ఈ దీక్ష, ప్రజల పట్ల అభిమానం మన నేతలకందరికీ ఉంటే ఎంత బావుండు అనిపిస్తోంది కదూ!