Begin typing your search above and press return to search.

సిద్దిపేట రైతు బజారు క్యాష్ లెస్ అయ్యిందిలా..

By:  Tupaki Desk   |   30 Nov 2016 6:54 AM GMT
సిద్దిపేట రైతు బజారు క్యాష్ లెస్ అయ్యిందిలా..
X
తెలంగాణ రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలకు కేంద్రంగా మారుస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటమే కాదు.. ఇందులో భాగంగా కొన్ని ప్రయోగాల్ని.. ప్రయోగాత్మకంగా సిద్ధిపేటలో చేపడతామని.. అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఆయన చెప్పి ఒకట్రెండు దినాలే అయినప్పటికీ.. ఇప్పటికే సిద్ధిపేటలో ఇలాంటి ప్రయోగం ఒకటి షురూ అయిపోయింది. దీనికి కేంద్రంగా రైతుబజారు నిలిచింది.

సిద్ధిపేటలోని రైతుబజారు మొత్తం ఇప్పుడు క్యాష్ లెస్ గా మారిపోయింది. రైతు బజారు ఏంది?క్యాష్ లెస్ గా ఎలా మారుతుందన్న సందేహం అక్కర్లేదు. మనసు ఉండే మార్గం ఉండకపోదన్నట్లుగా.. మనకు తగ్గట్లుగా ఇక్కడి రైతు బజారు అధికారులు వినూత్న ప్రయత్నం చేశారు. దీని ప్రకారం ఇక్కడి రైతు బజారుకు ఎంటర్ అయిన వారు.. తొలుత రైతుబజార్ సెంటర్ కు వెళ్లి తమకు కావాల్సిన మొత్తాన్ని తమ డెబిట్ కార్డుతో స్వైప్ చేయించుకుంటారు. ఉదాహరణకు ఒకరు రూ.100 స్వైప్ చేయించుకుంటే.. ఆ మొత్తానికి సరిపడా.. వివిధ డినామినేషన్లలో కొన్ని టోకెన్లను చేతికి ఇస్తారు.

ఎవరికి ఎవరి దగ్గర సరుకునచ్చుతుందో వారి దగ్గర కొనుక్కొని.. డబ్బులకు బదులుగా టోకెన్లను ఇచ్చేస్తారు. అలా తమకు వచ్చిన టకెన్లను దుకాణదారులు కౌంటర్ లోకి ఇచ్చేస్తే.. వారు అమ్మిన మొత్తాన్ని వారి అకౌంట్లో వేసేస్తారు. అంతా బాగానే ఉన్నా.. ఇక్కడో డౌట్ రావాలి. వంద రూపాయిలకు స్వైప్ చేయించుకున్నాక.. కేవలం 64 రూపాయిలకే కూరగాయలు కొన్నారనుకోండి. వారేం చేయాలి? ఆ చిల్లర మొత్తం మాటేమిటన్న సందేహానికి సిద్ధిపేట రైతుబజారు వారు సొల్యూషన్ వెతికేశారు. ఏదైతే కొనకుండా ఉంటారో.. ఆ మొత్తానికి సంబంధించిన టోకన్లు తిరిగి వెళ్లేటప్పుడు రైతుబజార్ కౌంటర్లో అప్పగిస్తే.. ఆ సాయంత్రానికి.. ఆ మొత్తాన్ని బదిలీ చేసే ఏర్పాటు చేశారు. క్యాష్ లెస్ లావాదేవీలు కష్టం అనుకుంటాం కానీ.. ఒక్కసారి మనసు పెడితే.. ఎన్నెన్ని కొత్త ఐడియాలో వచ్చేస్తున్నాయో చూశారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/