Begin typing your search above and press return to search.

త‌ర‌చూ చికెన్ తింటే..ఇంత ప్ర‌మాద‌మ‌ట‌

By:  Tupaki Desk   |   3 Feb 2018 9:32 AM GMT
త‌ర‌చూ చికెన్ తింటే..ఇంత ప్ర‌మాద‌మ‌ట‌
X
నాన్ వెజ్ ప్రియుల‌కు దుర్వార్త‌! ముఖ్యంగా తరచూ చికెన్ తినేవాళ్లకు ఒక ర‌కంగా హెచ్చ‌రిక‌. ఇలా ఎక్కువ‌గా చికెన్ తినేవాళ్లు ఒకసారి ఆలోచించాల్సిందేనని ఒక అధ్యయన సంస్థ హెచ్చరిస్తోంది. మానవుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే శక్తిమంతమైన యాంటీబయాటిక్‌ ను మనదేశంలో కోళ్ల పెంపకంలో భారీఎత్తున వినియోగిస్తున్నట్లుగా ఆ సంస్థ వెల్లడించింది. పౌల్ట్రీఫాంలలో కోళ్ల బరువును కృత్రిమ పద్ధతిలో వేగంగా పెంచేందుకు కొలిస్టిన్ అనే యాంటీబయాటిక్‌ ను విరివిగా వాడుతున్నట్లు ది బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే స్వతంత్ర సంస్థ వెల్లడించింది.

భారతీయ పౌల్ట్రీ రంగం.. గ్లోబల్ సూపర్‌ బగ్‌ లను (ఔషధాలకు లొంగని వ్యాధికారక సూక్ష్మజీవులను) సృష్టిస్తోందంటూ ది బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫారం కోళ్లు వేగంగా బరువు పెరిగేందుకు - అలాగే వాటికి వ్యాధులు రాకుండా నివారించేందుకు కొలిస్టిన్‌ ను భారీఎత్తున ఉపయోగిస్తున్నారని తెలిపింది. ఏటా కొన్ని వందల టన్నుల కొలిస్టిన్‌ ను విదేశాల నుంచి భారత్‌ కు దిగుమతి చేసుకుంటున్నారని తెలిపింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ విభాగంలో ఐక్యరాజ్యసమితికి సలహాదారుగా ఉన్న ప్రొఫెసర్ వాల్ష్ వ్యాఖ్యలను తన నివేదికలో ప్రస్తావించింది. అత్యంత తీవ్రంగా జబ్బుపడిన వారికి మాత్రమే వైద్యులు కొలిస్టిన్‌ ను ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని కోళ్ల పెంపకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు అని పేర్కొన్నారు.

కొలిస్టిన్‌ ను వైద్యులు చివరి ఆశ యాంటిబయాటిక్‌ గా పిల్చుకుంటారని - న్యుమోనియా వంటి ఇన్‌ ఫెక్షన్లతో తీవ్రంగా జబ్బు బారిన పడిన వారికి ఇతర ఔషధాలేవీ పని చేయనప్పుడు కొలిస్టిన్‌ ను ఇస్తారని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం సంస్థ వెల్లడించింది. ఇటువంటి యాంటిబయాటిక్‌ లను జంతువుల కోసం వినియోగించటాన్ని నియంత్రించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ ఓ) పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. కొలిస్టిన్ ప్రభావం వల్ల మనిషి శరీరం ఔషధ నిరోధకంగా తయారై ఔషధాలకు స్పందించని విధంగా మారుతుందని హెచ్చరించింది. ఇన్ని హెచ్చరికలు ఉన్నప్పటికీ - భారత్‌ లో జంతువుల ఔషధ తయారీ కంపెనీలు.. తమ ఉత్పత్తుల్లో కొలిస్టిన్‌ ను వినియోగిస్తున్నట్లుగా బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నాయని తెలిపింది.సో...బీ అల‌ర్ట్‌.