Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అధి నాయకత్వానికి చుక్కలు చూపిస్తున్న సిద్ధూ డిమాండ్లు

By:  Tupaki Desk   |   6 Nov 2021 3:37 PM GMT
కాంగ్రెస్ అధి నాయకత్వానికి చుక్కలు చూపిస్తున్న సిద్ధూ డిమాండ్లు
X
సొంత పార్టీ కి షాకులు ఇవ్వటంతో కాంగ్రెస్ నేతల తర్వాతే ఎవరైనా. అంతర్గత స్వాతంత్య్రం ఎక్కువగా ఉండే ఈ ఏజ్ ఓల్డ్ పార్టీలో నేతల తీరు మిగిలిన పార్టీల సీనియర్లకు చాలా భిన్నంగా ఉంటుంది. తమ రాజకీయ ప్రత్యర్థి బీజేపీని చూసి నేర్చుకోవాల్సింది పోయి.. పవర్ లేకుండా తమ పంతాలతో పార్టీకి షాకులు ఇవ్వటం కాంగ్రెస్ నేతలకే చెల్లుతుంది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు అప్పజెప్పిన పార్టీకి తన తీరుతో తలనొప్పిగా మారారు సిద్ధూ.

తన పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన ఆయన.. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే.. అందుకు కొన్ని షరతుల్ని పెట్టిన వైనం ఇప్పుడు మరో సంచలనంగా మారింది. అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి తప్పించటం.. అనంతరం చరణ్ సింగ్ చున్నీని ముఖ్యమంత్రిగా నియమించింది కాంగ్రెస్. అయితే.. తాజాగా మంత్రివర్గంలోని శాఖల కేటాయింపు వ్యవహారంపై ముఖ్యమంత్రి తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు సిద్ధూ.

ఇందులో భాగంగానే తన రాష్ట్ర పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన ఆయన.. ఆ లెటర్ ను అధిష్ఠానానికి పంపారు. అయితే.. ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఒత్తిడితో రాజీనామా లేఖను వెనక్కి తీసుకున్న ఆయన.. తాను పార్టీ ఛీఫ్ పదవిని చేపట్టాలంటే కొన్ని షరతులు ఉన్నాయంటూ లిస్టు పెట్టారు. అందులో కీలకమైనది.. ఇప్పుడున్న అడ్వకేట్ జనరల్ ను మార్చాలని.. డీజీపీ నియామకం తర్వాతే తాను పీసీసీ చీఫ్ పదవిని చేపడతానని చెప్పారు.

తాను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగత ఇగోతో తీసుకున్నది కాదని.. పంజాబీల ప్రయోజనం కోసం తీసుకున్నదిగా ఆయన చెబుతున్నారు. తన రాజీనామా నిర్ణయం వ్యక్తిగత ఇగోతో తీసుకున్నది కాదని స్పష్టం చేశారు. ఇంతకీ సిద్ధూ ఆ ఇద్దరి మీద ఎందుకంత మొండితనంతో ఉన్నారన్న విషయాన్ని చూస్తే.. అసలు సంగతేమిటన్నది అర్థమవుతుంది. ప్రస్తుతం పంజాబ్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న సీనియర్ న్యాయవాది ఏపీఎస్ డియోల్ నియమకాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు

దీనికి కారణం.. 2015లో అప్పటి అకాలీదళ్ ప్రభుత్వ హయాంలో నిరసనకారులపై కాల్పులు జరపటం.. మతపరమైన ఘటనలకు సంబంధించి కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీజీపీ సుమేధ్ సైనీ.. మరో పోలీసు అధికారి తరఫున వాదించిన డియోల్ ను ఏకంగా ఏజీ (అడ్వకేట్ జనరల్ )గా నియమించటాన్ని సిద్ధూ తీవ్రంగా తప్పు పడుతున్నారు. అతడి కోణంలో చూసినప్పుడు..కొంతమేర న్యాయం ఉందన్న భావన కలుగక మానదు. సిద్ధూ ఆరోపణల నేపథ్యంలో ఏజీ పదవికి డియోల్ రాజీనామా చేస్తూ లేఖను ముఖ్యమంత్రికి పంపారు. అయితే.. ఈ రాజీనామాను సీఎం ఒప్పుకోనట్లుగా చెబుతున్నారు. తన డిమాండ్లను ఓకే చేసిన తర్వాతే పీసీసీ చీఫ్ గా బాద్యతల్ని చేపడతానని ఆయన స్పష్టం చేస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు సిద్ధూ వాదనలో న్యాయం ఉందన్న భావన కలుగుతుంది. అయితే.. పార్టీలో ఇలాంటి విషయాల్ని చర్చించి.. ఒక నిర్ణయం తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా అమలు చేస్తే పోయేదానికి.. అందుకు భిన్నంగా బయటకు వచ్చి ఒకరికొకరు కౌంటర్లు.. ప్రతి కౌంటర్లు విసురుకుంటున్నట్లుగా వ్యాఖ్యలు చేయటం సిద్దూ వ్యక్తిగత ఇమేజ్ ఏమోకానీ.. పార్టీ పరువు మాత్రం చంక నాకి పోతుందన్న విషయాన్ని ఆయన ఎందుకు మిస్ అవుతున్నట్లు? ఏమైనా.. ఇలాంటి నాయకులు కాంగ్రెస్ కే దొరుకుతారే.