Begin typing your search above and press return to search.

పాటియాల జైలులో సిద్ధూ చేస్తున్న ఉద్యోగమిదే!

By:  Tupaki Desk   |   26 May 2022 9:30 AM GMT
పాటియాల జైలులో సిద్ధూ చేస్తున్న ఉద్యోగమిదే!
X
34 ఏళ్ల క్రితం పార్కింగ్ విషయంలో గొడవ పడి ఓ వృద్దుడి చావుకి కారణమైన కేసులో ప్రస్తుతం పంజాబ్ లోని పాటియాలా సెంట్రల్ జైలులో పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ నవజోత్ సింగ్ సిద్దూ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించింది. సిద్ధూ తన అనారోగ్య కారణాలను చూపి కొన్నాళ్లపాటు లొంగిపోకుండా ఉండటానికి ప్రయత్నించినా కోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరించింది.

కాగా పాటియాలా జైలులో సిద్ధూ ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనను జైలు అధికారులు మున్షీగా నియమించారని సమాచారం. సెంట్రల్ జైలులో క్లరికల్ వర్క్ చేస్తున్న క్లర్కుకు అసిస్టెంట్ క్లర్కుగా సిద్ధూని నియమించినట్టు చెబుతున్నారు. ఈ మేరకు సిద్ధూ మే 25 నుంచే తన పని ప్రారంభించారు. మంగళవారం ఉదయం 9  గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో సిద్ధూ మున్షీగా పని చేస్తున్నారని జైలు అధికారులు తెలిపారు. కాగా ఈ రెండు వర్కింగ్ షిఫ్టుల మధ్య సిద్ధూకి మూడు గంటల విశ్రాంతి ఉంటుంది.

అయితే.. పాటియాలా జైలు నిబంధనల ప్రకారం.. సిద్ధూకు మొదటి మూడు నెలలు జీతం ఏమీ ఉండదు. మొదటి మూడు నెలలు కేవలం ఆయన ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్య శిక్షణ మాత్రమే ఇవ్వనున్నారు.

ఆ తర్వాత మూడు నెలలు శిక్షణ ముగిసిన తర్వాత సెమీ-స్కిల్డ్ లేదా నైపుణ్యం కలిగిన ఖైదీగా సిద్ధూని గుర్తిస్తారు. సిద్ధూ పనిచేసే తీరును బట్టి రోజుకు రూ.30 నుంచి రూ.90 మధ్య ఆయనకు ఇస్తారు. అయితే.. పనిని బట్టి చూస్తే సిద్ధూ మూడు నెలల శిక్షణ పూర్తయిన తర్వాత రోజుకు రూ.40 సంపాదించనున్నట్లు సమాచారం. ఈ వేతనం మొత్తాన్ని సిద్ధూ బ్యాంకు ఖాతాలో వేస్తారు.

కాగా పాటియాలా జైలులో ఉన్న సిద్దూ తన అనారోగ్యం కారణంగా ప్రత్యేక ఆహారం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సిద్ధూకు జైలు ఆహారం కాకుండా ప్రత్యేక ఆహారం తెచ్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆయన న్యాయవాది వేసిన పిటిషన్ కు కోర్టు అంగీకరించిందని సమాచారం.

గతంలో సిద్ధూ ఇండియన్ క్రికెట్ టీమ్ లో డ్యాషింగ్ ఓపెనర్ గా పేరు గడించారు. సిక్సర్ల సిద్ధూగా అభిమానులు ఆయనను పిలుచుకుంటారు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ఆయన వ్యాఖ్యాతగా, టీవీ ప్రజెంటేటర్ గా రాణించారు. అమృత్ సర్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా కూడా గెలిచారు. ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. తర్వాత ఆ పార్టీతో విబేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి తన వివాదాస్పద తీరుతో ఆ పార్టీ పుట్టి ముంచారు. ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేశారు.