Begin typing your search above and press return to search.

150 మంది అనుచ‌రుల‌కు ఏపీ మంత్రి వీఐపీ ద‌ర్శ‌నం చేయించారా?

By:  Tupaki Desk   |   28 July 2022 6:31 AM GMT
150 మంది అనుచ‌రుల‌కు ఏపీ మంత్రి వీఐపీ ద‌ర్శ‌నం చేయించారా?
X
తిరుమల శ్రీవారిని ఏపీ మ‌త్స్య‌శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు దాదాపు 150 మంది అనుచరులతో వెళ్లి దర్శించుకోవడం తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. 150 మంది అనుచ‌రుల‌ను మంత్రి వీఐపీ ప్రోటోకాల్‌తో శ్రీవారి ద‌ర్శ‌నానికి తీసుకెళ్లార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

దీంతో మంత్రి తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు సాధార‌ణ భ‌క్తులు కూడా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారుల‌పై మండిప‌డుతున్నారు. సాధార‌ణ భ‌క్తుల‌ను గంట‌ల త‌ర‌బ‌డి క్యూలో నిల‌బెడుతున్నార‌ని.. సెల‌బ్రిటీల‌కే కాకుండా వారి వెంట వ‌చ్చేవారికి వీఐపీ ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మంత్రికో న్యాయం.. సామాన్య‌భ‌క్తుల‌కో ఓ న్యాయ‌మా అని భ‌క్తులు, సామాన్య ప్ర‌జ‌లు టీటీడీ అధికారుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ద‌ర్శ‌నం అనంతరం మంత్రి అప్ప‌ల‌రాజు మాత్రం తామంతా సామాన్య భ‌క్తుల మాదిరిగానే వెళ్లి స్వామిని ద‌ర్శించుకున్నామ‌ని.. వీఐపీ ద‌ర్శ‌నం కాద‌ని చెబుతున్నారు. అంతేకాకుండా త‌మ వ‌ల్ల సాధార‌ణ భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌లేద‌ని అంటున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ముంపుకు గురైన ప్రాంతాలను సీఎం జగన్‌ స్వయంగా పరిశీలించి వారిని ఆదుకుంటున్నారని మంత్రి అప్పలరాజు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు అవసరమైన నిధుల‌ను విడుద‌ల చేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని.. త్వరలోనే నిర్మాణం పూర్తవుతుందని అంటున్నారు.

కాగా ఇప్ప‌టికే మంత్రి సీదిరి అప్ప‌లరాజు ప‌లు వివాదాల్లో చిక్కుకున్నారు. వైఎస్ జ‌గ‌న్ గ‌తంలో విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు త‌న అనుచ‌రుల‌ను అడ్డుకున్న సీఐని చొక్కా విప్ప‌దీసి కొడ‌తానంటూ వార్నింగ్ ఇచ్చారు.

దీనిపై అప్ప‌ట్లో పెద్ద ఎత్తున మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇటీవ‌ల శ్రీకాకుళంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలోనూ త‌న‌ను ప్ర‌శ్నించిన ప్ర‌జ‌లపై బూతుల దండ‌కం ఎత్తుకున్నార‌ని విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. ఇప్పుడు మ‌ళ్లీ తాజాగా తిరుమ‌ల‌లో ఏకంగా 150 మంది అనుచ‌రుల‌తో వీఐపీ ద‌ర్శ‌నం చేసుకోవ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.