Begin typing your search above and press return to search.

సిక్కిరెడ్డికి పాజిటివ్..గోపీచంద్ అకాడమీ మూసివేత

By:  Tupaki Desk   |   14 Aug 2020 4:15 AM GMT
సిక్కిరెడ్డికి పాజిటివ్..గోపీచంద్ అకాడమీ మూసివేత
X
వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరిలోనూ పాకేస్తున్న కోవిడ్ 19కు తాజాగా మరో క్రీడాకారిణి బాధితురాలిగా మారారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించటంతో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యం ప్రాక్టీస్ తో ఒళ్లు అలిసిపోయేలా ఆడే క్రీడాకారులు సైతం ఆటవిడుపుగా తమ ప్రాక్టీస్ పెద్దగా చేయని పరిస్థితి. లాక్ డౌన్ ఎత్తేయటం.. అన్ లాక్ మొదలు కావటం.. ఒక్కో ప్రొఫెషన్ కు చెందిన వారు తమ రోటీన్ జీవితాల్లోకి నెమ్మదిగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. క్రీడాకారులది అలాంటి పరిస్థితే.

ఇప్పుడిప్పుడే అన్ని కార్యకలాపాలు మొదలవుతున్న వేళ.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అలాంటివన్నీ తీసుకుంటున్నట్లు చెబుతున్నా.. కరోనా పాజిటివ్ గా తేలుతున్నారు. తాజాగా అలాంటి పరిస్థితి గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో చోటు చేసుకుంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.. మహిళల డబుల్స్ స్టార్ షట్లర్ నేలకుర్తి సిక్కిరెడ్డి ఆమె ఫిజియోథెరపిస్టు కిరణ్ లు ఇద్దరు కరోనా బారిన పడ్డారు.

ఇటీవల ప్రాక్టీస్ మొదలు పెట్టిన వీరు సాయ్ నిబంధనల ప్రకారం.. వీరితో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న 20 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో సిక్కిరెడ్డికి.. ఆమె ఫిజియోథెరపిస్టు కిరణ్ లకు కరోనా పాజిటివ్ అని తేలింది. అదే సమయంలో పీవీ సింధు.. ఆమె తండ్రి పీవీ రమణ.. చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్.. సాయిప్రణీత్.. కిడాంబి శ్రీకాంత్ లతో సహా పద్దెనిమిది మందికి నెగిటివ్ గా తేలింది. సిక్కిరెడ్డి... ఆమె ఫిజియోథెరపిస్టుకు పాజిటివ్ గా తేలటంతో గోపీచంద్ అకాడమీని తాత్కాలికంగా మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పాజిటివ్ గా తేలినప్పటికి వీరిద్దరికి ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని చెబుతున్నారు. సిక్కిరెడ్డి.. కిరణ్ లకు ప్రైమరీ కాంటాక్టు అయిన వారందరికి ఈ రోజు (శుక్రవారం) పరీక్షలు చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అకాడమీని మూసి.. శానిటైజ్ చేయిస్తున్నారు. త్వరలోనే తమ అకాడమీని స్టార్ట్ చేస్తామని గోపీచంద్ చెబుతున్నారు. ఏమైనా.. కరోనా కాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని అకాడమీని తెరవటం తప్పనిసరిగా చెప్పక తప్పదు.