Begin typing your search above and press return to search.

ట‌్రంప్ గెలుపు.. సిలికాన్ వ్యాలీకి కుదుపు!

By:  Tupaki Desk   |   10 Nov 2016 8:27 PM GMT
ట‌్రంప్ గెలుపు.. సిలికాన్ వ్యాలీకి కుదుపు!
X
అనుకున్న‌దొక్క‌టీ అయ్యింది ఇంకొక్క‌టీ అన్న‌ట్టుగా మారాయి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాలు. కంపు మాట‌ల ట్రంప్ గెల‌వ‌కూడ‌ద‌ని చాలామంది అనుకున్నారు! స‌ర్వేలు కూడా హిల్ల‌రీకే ఓటేశాయి. కానీ, త‌న‌పై వెల్లువెత్తిన వ్య‌తిరేక‌త‌ను అనుకూలంగా మార్చుకుని అధ్య‌క్షుడు అయిపోయారు ట్రంప్‌. అమెరిక‌న్ జాతీయవాదాన్ని రెచ్చ‌గొడుతూ స్థానికుల‌కు నోటికొచ్చిన హామీలు ఇచ్చేశారు. ట్రంప్ దూకుడుకి చాలామంది ఆందోళ‌న చెందారు. సిలికాన్ వ్యాలీ కూడా టెన్ష‌న్ ప‌డింది. ట్రంప్ దురుసు వైఖ‌రి వ‌ల్ల ఐటీ రంగం ప‌త‌కం ఖాయ‌మ‌ని భావించారు. అందుకే, ట్రంప్ గెలుపును అడ్డుకునేందుకు సిలికాన్ వ్యాలీ కూడా బాగానే ప్ర‌య‌త్నం చేసింద‌ని చెప్పాలి! ఆయ‌న‌కి వ్య‌తిరేకంగా, హిల్ల‌రీ క్లింట‌న్‌ కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ ఏకంగా 114 శాతం ఎక్కువ‌ ఎన్నికల ప్ర‌చార నిధులిచ్చారు వ్యాలీ ప్ర‌ముఖులు. అయితే, ట్రంప్ గెలుపుతో క‌థ అడ్డం తిరిగింది.

సిలికాన్ వ్యాలీకి ఇప్పుడు ట్రంప్ జ్వ‌రం ప‌ట్టుకుంద‌ని చెప్పాలి. అత‌డి గెలుపు ఐటీ రంగానికి దెబ్బ అనుకున్నారు. అనుకున్న‌ట్టుగానే ఆయ‌న గెలిచేశారు. ఇప్పుడు సిలికాన్ వ్యాలీ ప‌రిస్థితి ఏమౌతుంద‌నీ, ఒక‌వేళ మూత ప‌డే ప్ర‌మాదం ఉందా అనే ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మౌతున్నాయి. మొత్తంగా ఐటీ సెక్టార్ కే ట్రంప్ వైఖ‌రి దెబ్బ కొడుతుందేమో అని క‌ల‌వ‌ర‌పాటు మొదలైంది. అమెరిక‌న్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఇష్టం వ‌చ్చిన హామీలు ఇచ్చారు. విదేశీ వ‌ల‌స‌దారుల్ని అడ్డుకుంటామ‌నీ - ఇమ్మిగ్రేష‌న్ పాల‌సీ మారుస్తామ‌నీ - స్థానికుల‌కు ఉద్యోగాల్లో ప్రాధాన్య‌త పెంచుతామ‌నీ.. ఇలాంటి హామీలు ఇచ్చారు.

నిజానికి, వ‌ల‌స‌దారుల కార‌ణంగానే సిలికాన్ వ్యాలీకి వెలుగు. అయితే, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను ఎలాగైనా నిల‌బెట్టుకునే ప‌ట్టుద‌ల ట్రంప్‌కి ఉంద‌ని అంటున్నారు. ఒక‌వేళ అదే జ‌రిగితే సిలికాన్ వ్యాలీకి క‌ష్ట‌కాలం త‌ప్ప‌ద‌న్న భావ‌న పెరుగుతోంది. దీంతోపాటు సిలికాన్ వ్యాలీకి చెందిన కొంద‌రు పెద్ద‌ల‌కి ట్రంప్ తో వ్య‌క్తిగత వైరాలు కూడా ఉన్నాయ‌ట‌! వెర‌సి ఇవ‌న్నీ సిలికాన్ వ్యాలీ పుట్టిముంచేలా ప‌రిస్థితి మారొచ్చ‌ని విశ్లేషించుకుంటున్నారు. అయితే, ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డం అనుకున్నంత సులువైన ప‌ని కాదు అనే ఆశాభావంతో ఉన్న‌వారూ లేక‌పోలేదు. పైగా, వ‌ల‌స‌దారుల వ‌ల్ల‌నే సిలికాన్ వ్యాలీ క‌ళ‌క‌ళ‌లాడుతోంది. అక్క‌డున్న నైపుణ్య‌మంతా వ‌ల‌స‌దారుల‌దే. ఎక్కువ జీతాలిస్తేగానీ స్థానికులు ప‌నిచెయ్య‌రు. పైగా, నైపుణ్యాల కొర‌త‌. తక్కువ జీతానికి మెరుగైన నైపుణ్యాల‌తో ప‌నిచేస్తున్నవారిని దూరం చేసుకుంటే నష్టం ఎవ‌రికి అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా, సిలికాన్ వ్యాలీకి ట్రంప్ ఫీవ‌ర్ ప‌ట్టుకుందన్న‌ది వాస్త‌వం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/