Begin typing your search above and press return to search.

మన ట్రంప్ మాల్యాయేనా?

By:  Tupaki Desk   |   2 Nov 2016 7:30 PM GMT
మన ట్రంప్ మాల్యాయేనా?
X
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుస్తాడో లేదో అప్పుడే చెప్పలేం కానీ.. ఒక‌వేళ ట్రంప్ గెలిస్తే ఏంటి ప‌రిస్థిత‌న్న అంచ‌నాలు మాత్రం వెలువ‌డుతున్నాయి. ట్రంప్ గెల‌వ‌కూడ‌ద‌ని ఎంత‌మంది కోరుకుంటున్నారో గెల‌వాల‌ని కోరుకుంటున్నవారూ దాదాపుగా అంతే ఉన్నారు. హిల్లరీ - ట్రంప్ మధ్య దోబూచులాడుతున్న విజయం ఎవరిని వరిస్తుందన్నది ప‌క్కన‌పెడితే ట్రంప్ గెలిచాక ప‌రిణామ‌ల‌పై అక్కడ‌క్కడా స‌ర‌దా సంభాష‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీనిపై మీడియాలోనూ సెటైరిక్ గా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అందులో ఒక‌టి ఇటీవ‌ల బాగా పాపుల‌ర్ అవుతోంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే భార‌త్‌లో ఆ త‌ర‌హా వ్యక్తి అయిన విజ‌య్ మాల్యా రాష్ట్రప‌తి అయినా కావొచ్చని... అప్పుడు రిప‌బ్లిక్ డే వంటి సంద‌ర్భాల్లో ట్రంప్‌ ను గెస్టుగా పిల‌వొచ్చంటూ వ్యంగ్య క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

ఈ సంద‌ర్భంగా ట్రంప్‌ - మాల్యాల మ‌ధ్య పోలిక‌లు చూపుతున్నారు. ట్రంప్ బ్రహ్మాండ‌మైన ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నట్లే మాల్యా కూడా సృష్టించుకున్నారు. ట్రంప్ కు ప‌న్ను ఎగ‌వేతలు - రాజ‌కీయ నేత‌ల‌కు లంచాలు ఇవ్వడం - లాలూచీలు వంటివి వెన్నతో పెట్టిన విద్య అని చెబుతారు. మ‌న మాల్యాది కూడా అదే దారి. ఇద్దరూ కాస‌నోవాలే. అంద‌మైన అమ్మాయిల మ‌ధ్య గ‌డ‌ప‌డంలోనూ ఇద్దరికి ఇద్దరూ ఒక‌టే. అలాంట‌ప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీప‌డుతున్నట్లే మాల్యా కూడా ఏనాటికైనా ప్రధాన మంత్రో - రాష్ట్రప‌తో అయినా ఆశ్చర్యపోన‌వ‌స‌రం లేద‌ట‌. మ‌న గ‌ణతంత్ర - స్వాతంత్ర్య దినోత్సవాల‌కు ఇత‌ర దేశాల అధినేత‌ల‌ను పిల‌వ‌డం ఆన‌వాయితీ... అలా ఎప్పుడైనా మాల్యా దేశంలో ఉన్నత ప‌దవుల్లో ఉన్నప్పుడు ట్రంప్ కూడా అమెరికాలో అధ్యక్షుడిగా ఉంటే ఆయ‌న్ను అతిథిగా పిల‌వొచ్చంటున్నారు.

అన్నట్లు ఇంకోమాట‌... ట్రంప్ - మాల్యాల మ‌ధ్య సంబంధ‌మేముంది అని కొట్టిపారేయ‌కండి. అమెరికాలో ట్రంప్ క‌ట్టిన భారీ భ‌వంతుల్లో మాల్యా బ్రహ్మాండ‌మైన ఫ్లాట్లు కొన్నార‌ట‌. కాబ‌ట్టి ఇద్దరికీ ఎక్కడో లింకు క‌లిసే ఉంటుంది. మాల్యా బ్యాంకుల‌కు రుణాలు ఎగ్గొట్టి లండ‌న్ పారిపోయినా కూడా ఇప్పటికీ మ‌న నేత‌లు - ప్రపంచ‌వ్యాప్తంగా ఆయ‌న‌కున్న ఫ్రెండ్సుతో సంబంధాలు బాగానే మెంటైన్ చేస్తున్నారు. దీపావ‌ళి కూడా ఖ‌రీదైన మ‌ద్యం సీసాలు గిఫ్టులుగా పంపించారు చాలామందికి. ఏమో మాల్యా గుర్రం మళ్లీ ఎగరవచ్చేమో?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/