Begin typing your search above and press return to search.

ఆ చిన్నారి ఆవేద‌న ఈ పెద్దాళ్లు ప‌ట్టించుకోలేదు!

By:  Tupaki Desk   |   30 April 2019 6:18 AM GMT
ఆ చిన్నారి ఆవేద‌న ఈ పెద్దాళ్లు ప‌ట్టించుకోలేదు!
X
పోట్లాట ఎందుకో? కోట్లోట ఎందుకో తెలీని వ‌య‌సు. చిరుప్రాయంలో అమ్మా.. నాన్న‌ల గారం మ‌ధ్య పెర‌గాల్సిన బాల్యం.. అందుకు భిన్నంగా కెమేరాలు వెంటాడుతుంటే.. నాదంటే.. నాదంటూ తోసేసుకోవ‌టం.. లాగేసుకోవ‌టం.. పెనుగులాట‌లో న‌లిగిపోయిన చిన్నారి క‌ష్టం చూసిన‌ప్పుడు కంట క‌న్నీరు ఆగ‌ని ప‌రిస్థితి.

ఒక చిన్న మ‌న‌సు గురించి ఆలోచించ‌కుండా.. దాని క‌ష్టం గురించి ప‌ట్టించుకోకుండా కాట్ల కుక్క‌ల మాదిరి కోట్లాడుకున్న తీరు చూసిన‌ప్పుడు.. త‌ల్లి.. తండ్రి ఇద్ద‌రి మీద ఒళ్లు మండిపోయేంత కోపం రావ‌టం ఖాయం. త‌ప్పు ఎవ‌రిదైనా కావొచ్చు.. కానీ.. పెద్దోళ్ల గొడ‌వ‌ల మ‌ధ్య చిన్నోళ్లు న‌లిగిపోవాల్సిన అవ‌స‌రం ఏమిటి? పెద్ద పెద్ద చ‌దువులు చ‌ద‌వి.. అత్యున్నత‌ స్థానంలో ఉన్న కుటుంబంలో చోటు చేసుకున్న తాజా ర‌చ్చ చూసిన‌ప్పడు ఆగ్ర‌హ‌మే క‌ల‌గ‌ట‌మే కాదు.. వారి కోట్లాట మ‌ధ్య న‌లిగిన చిన్నారి ఉదంతం అయ్యో అనిపించటం ఖాయం.

మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూతి రామ్మోహ‌న‌రావు కుమారుడు వ‌శిష్ఠ‌.. కోడ‌లు సింధు మ‌ధ్య త‌గాదా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు సుప‌రిచితం. త‌న‌ను వేధించ‌ట‌మే కాదు.. శారీర‌క హింస‌కు గురి చేస్తున్న అత్తారింటి మీద సింధు న్యాయ‌పోరాటం స్టార్ట్ చేయ‌టం తెలిసిందే. వారికున్న ఇద్ద‌రి పిల్ల‌ల్లో పాలిచ్చేంత చిన్న వ‌య‌సున్న కుమార్తెను త‌ల్లికి అప్ప‌గించారు. మూడేళ్ల పెద్ద కుమార్తెను మాత్రం తండ్రి త‌న ద‌గ్గ‌రే ఉంచుకున్నారు.

ఒక‌వైపు త‌న‌కు న్యాయం చేయాల‌ని.. మ‌రోవైపు పెద్ద కుమార్తెను త‌న‌కు ఇవ్వాలంటూ ఆందోళ‌న చేస్తున్న సింధుకు తోడుగా మ‌హిళా సంఘాలు..మాన‌వ‌హ‌క్కుల సంఘాల వారు అండ‌గా నిలిచారు. ఆదివారం నెల‌కొన్న హైడ్రామా అనంత‌రం.. చిన్న‌పాప‌ను త‌ల్లికి ఇచ్చేసిన త‌ర్వాత‌.. సోమ‌వారం భ‌రోసా సెంట‌ర్ వ‌ద్ద విషయం తేల్చుకోవాల‌ని నిర్ణ‌యించుకోవ‌టం తెలిసిందే.

త‌న‌ను వేధింపుల‌కు గురి చేసిన భ‌ర్త‌.. అత్త‌మామ‌ల‌పై న్యాయ‌పోరాటం చేస్తున్న సింధు.. త‌న పిల్ల‌లు ఇద్ద‌రిని త‌న‌కు ఇచ్చేయాల‌ని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మూడేళ్ల పెద్ద కుమార్తె ప్ర‌స్తుతం తండ్రి వ‌ద్దే ఉంటోంది. ఇదిలా ఉంటే..సోమ‌వారం మ‌ధ్యాహ్నం భ‌రోసా సెంట‌ర్ కు రెండు కుటుంబాల వారు వ‌చ్చారు. పెద్ద కుమార్తె రిషిత‌ను తీసుకొని వ‌శిష్ఠ భ‌రోసా సెంట‌ర్ కు వ‌చ్చారు. త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సింధు కూడా వ‌చ్చారు. త‌న కుమార్తెను త‌న‌కు ఇచ్చేయాలంటూ భ‌ర్త నుంచి లాక్కునే ప్ర‌య‌త్నం చేయ‌టం.. అత‌గాడు కుమార్తెను ఎంత‌కూ వ‌ద‌ల‌ని వైనం.. ఇద్ద‌రి మ‌ధ్య చోటు చేసుకున్న పెనుగులాట‌లో.. అస‌లేం జ‌రుగుతుందో అర్థం కాని చిన్నారి ఆవేద‌న‌తో ఏడ్చేసిన ఏడుపు పెద్దోళ్ల‌కు అస్స‌లు ప‌ట్ట‌లేదు.

త‌మ పంతాన్ని నెర‌వేర్చుకోవ‌ట‌మే ల‌క్ష్యం త‌ప్పించి.. చిన్నారి మ‌నసుకు గాయం కాకూడ‌ద‌న్న ఆలోచ‌న రెండు వ‌ర్గాల‌కు లేదా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. పెద్దోళ్ల మ‌ధ్య గొడ‌వ‌లు.. వారిలో ఎవ‌రు మంచి.. ఎవ‌రు చెడు.. అన్న విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. పెద్ద‌ల గొడ‌వ‌లు పిల్ల‌ల మీద ప‌డ‌కూడ‌ద‌న్న క‌నీస ఆలోచ‌న వారు చేయ‌లేరా? అన్న సందేహం రాక మాన‌దు.

పిల్ల‌ల మీద అంత ప్రేమ అయితే.. వారిని క‌న్న త‌ల్లిని చ‌క్క‌గా చూసుకోవాల‌న్న ఆలోచ‌న లేదా? అన్న‌ది వ‌శిష్ఠ‌ను చూస్తే అనిపించ‌క మాన‌దు. మూడేళ్ల ప‌సిప్రాయంలో ఉన్న చిన్నారికి తండ్రి కంటే.. త‌ల్లి అవ‌స‌రం ఎక్కువ‌న్న విష‌యం ఎవ‌రుచెప్పాలి. చ‌ట్టం.. న్యాయం.. ఇలాంటివి కాసేపు ప‌క్క‌న పెట్టి.. స‌గ‌టు మ‌నిషిలా ఆలోచించిన‌ప్పుడు.. పెద్దోళ్ల పోరు.. చిన్నారుల‌కు శాపంగా మార‌కూడ‌ద‌న్నది మర్చిపోకూడ‌దు.

భ‌రోసా సెంట‌ర్ లో ఏడు గంట‌ల పాటు సాగిన హైడ్రామా సంద‌ర్భంగా చిన్నారి రిషిత త‌ల్ల‌డిల్లిపోయింది. అమ్మా.. నాన్న‌లు ఎందుకు గొడ‌వ ప‌డుతున్నారో అర్థం కాక చిట్టి ప్రాణం విల‌విల‌లాడింది. చివ‌ర‌కు.. త‌న కుమార్తెను ఇచ్చేది లేదంటూ భ‌ర్త వ‌శిష్ఠ వెళ్లిపోవ‌టం.. కుమార్తెను మిస్ అయిన భార్య సింధులు వేద‌న చెంద‌టం ఒక ఎత్తు అయితే.. భ‌ర్తతో కారులోకి ఎక్కే ప్ర‌య‌త్నం చేసిన సింధు కార‌ణంగా ఉద్రిక్త ప‌రిస్థితి చోటుచేసుకుంది. చివ‌ర‌కు రంగ ప్ర‌వేశం చేసిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకోగా.. కుమార్తెను తీసుకొని భ‌ర్త కారులో వెళ్లిపోయారు.