Begin typing your search above and press return to search.

పెద్దామ్మాయిని త‌ల్లి సింధుకే ఇచ్చేయాల‌న్న హైకోర్టు!

By:  Tupaki Desk   |   2 May 2019 10:29 AM GMT
పెద్దామ్మాయిని త‌ల్లి సింధుకే ఇచ్చేయాల‌న్న హైకోర్టు!
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించిన విశ్రాంత న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూతి రామ్మోహ‌న్ రావు కోడ‌లు సింధు దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై హైకోర్టు తాజాగా స్పందించింది. కీల‌క ఆదేశాల్ని జారీ చేసింది. జ‌స్టిస్ నూతి రామ్మోహ‌న్ రావు కుమారుడు వ‌శిష్ఠ‌.. సింధుశ‌ర్మ‌ల వివాహం జ‌ర‌గటం.. దంప‌తుల ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు రావ‌టం తెలిసిందే. అత్తింట్లో త‌న‌ను వేధింపుల‌కు గురి చేస్తున్న‌ట్లుగా ఆరోపించిన సింధు.. మీడియా ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా త‌న ఇద్ద‌రు పిల్లల్ని త‌న‌కు ఇచ్చేయాల‌ని సింధు డిమాండ్ చేసింది.

ఈ క్ర‌మంలో సింధు కుటుంబానికి.. వ‌శిష్ఠ కుటుంబానికి మ‌ధ్య వివాదం న‌డిచింది. త‌న‌కు న్యాయం చేయాలంటూ భ‌ర్త ఇంటి ముందు ఆందోళ‌న చేప‌ట్టారు సింధుశ‌ర్మ‌. ఈ క్ర‌మంలో ఏడాదిన్న‌ర వ‌య‌సున్న చిన్న కుమార్తెను సింధుకు అప్ప‌గించారు. ఇదంతా ఆదివారం జ‌రిగింది.

అయితే.. మ‌రో చిన్నారి అయిన పెద్ద కుమార్తెను కూడా త‌న‌కు ఇచ్చేయాల‌ని సింధు కోరుతున్నారు. చిన్నపాప‌ కావ‌టంతో ఆమెను తానే చూసుకుంటాన‌ని చెబుతున్నారు. అయితే.. భ‌ర్త మాత్రం అందుకు స‌సేమిరా అంటూ పెద్ద కుమార్తెను ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. వీరిద్ద‌రి వ్య‌వ‌హారం సోమ‌వారం భ‌రోసా సెంట‌ర్ కు చేర‌టం.. అక్క‌డ హైడ్రైమా చోటు చేసుకున్న వైనం తెలిసిందే.

పెద్ద కుమార్తెను సింధుకు అప్ప‌గించేది లేద‌ని తేల్చి చెప్పిన భ‌ర్త మాట‌తో.. హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ ఉదంతంపై తాజాగా విచార‌ణ జ‌రిపిన కోర్టు..పెద్ద కుమార్తెను త‌ల్లికి అప్ప‌జెప్పాల‌న్న ఆదేశాల్ని జారీ చేసింది. తాజా ఆదేశాల నేప‌థ్యంలో వారంలో ఐదురోజుల పాటు త‌ల్లి ద‌గ్గ‌ర‌.. రెండు రోజులు తండ్రి ద‌గ్గ‌ర ఉంచాల‌ని కోర్టు పేర్కొంది. హైకోర్టు విచార‌ణ‌కు పిల్ల‌ల‌తో స‌హా సింధు.. ఆమె భ‌ర్త వ‌శిష్ఠ హాజ‌ర‌య్యారు. శుక్ర‌వారం సాయంత్రం పెద్ద‌కుమార్తెను సింధుకు అప్ప‌జెప్పాల‌ని కోర్టు పేర్కొంది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ జూన్ 4కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.