Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: శింగనమల

By:  Tupaki Desk   |   23 March 2019 7:52 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: శింగనమల
X
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. గత 1983 నుంచి వరుసగా ఎన్నికలను పరిశీలిస్తే అక్కడ ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ అధికారంలోకి రావడం పరిపాటిగా మారింది. ఫలితంగా రాష్ట్ర రాజకీయాల్లో శింగనమల సీటు హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి - కమ్యూనిస్ట్‌ పోరాట యోధుడు తరిమెల నాగిరెడ్డి ఈ నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. శింగనమల నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. గత 1983 నుంచి ఎన్నికలు పరిశీలిస్తే ఇది వాస్తవ మనే తేలుతోంది. పార్టీలు మారి పోటీ చేసిన వారిని ఓడించడం ఈ నియోజకవర్గ ఓటర్ల ప్రత్యేకత. చివరకు వారు రాజకీయాల నుంచే తప్పుకునేందుకు కారణమవుతుంటారు. శింగనమల నియోజకవర్గం 1967లో ఏర్పడింది. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికలు జరిగాయి. 1978లో ఎస్సీ నియోజకవర్గంగా రిజర్వుడు అయింది.

1983 గురుమూర్తి (టీడీపీ)
1985 కె.జయరాం (టీడీపీ)
1989 పామిడి శమంతకమణి (కాంగ్రెస్‌)
1994 కె.జయరాం (టీడీపీ)
1999 కె.జయరాం (టీడీపీ)
2004 సాకే శైలజానాథ్‌ (కాంగ్రెస్‌)
2009 సాకే శైలజానాథ్‌ (కాంగ్రెస్‌)
2014 యామినిబాల (టీడీపీ)

గత రికార్డులు.. పార్టీ మారినా ఓటమే..

1985లో కాంగ్రెస్‌ పార్టీలోకి పామిడి శమంతకమణి చేరి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 1989లో ఆదే పార్టీ నుంచి పామిడి శమంతకమణి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1994లో కాంగ్రెస్‌ తరఫున శమంతకమణి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ గెలిచింది.. అధికారంలోకి వచ్చింది. 1999లో కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో శమంతకమణి టీడీపీలో చేరిపోయారు. 2004 - 2009 ఎన్నికల్లో టీడీపీపై పోటీ చేసిన శమంతకమణిని ఓటర్లు ఓడించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ రాకపోవడంతో కె.జయరాం పీఆర్‌ పీలోకి మారారు. ఆ ఎన్నికల్లో జయరాంకు డిపాజిట్‌ కూడ దక్కలేదు. ఈ క్రమంలో పార్టీ మారిన ప్రతి నాయకుడినీ ఓడించారు. అదేవిధంగా ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీదే అధికారం.

టీడీపీపై భారీ వ్యతిరేకత

శింగనమల ఎమ్మెల్యే యామినిబాల వ్యక్తిగత సంపాదనే ధ్యేయంగా పని చేయడంతో ఆమెపై నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత బలపడింది. సొంత పార్టీకి చెందిన నాయకులు - కార్యకర్తలే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు చేపట్టిన అంతర్గత సర్వేలలో సైతం యామినిబాలకు వ్యతిరేకంగా నివేదికలు వెళ్లాయి. ఫలితంగా ఈసారి ఎన్నికల్లో ఆమెకు టికెట్‌ ఇవ్వకుండా బండారు శ్రావణికి కేటాయించారు. అయితే జేసీ వర్గీయులు తప్ప మిగిలిన నాయకులందరూ బండారు శ్రావణిని వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. ఫలితంగా వైఎస్సార్‌ సీపీ గెలుపు సులువు అవుతుందని చెప్పవచ్చు.

వైఎస్సార్‌ సీపీకే విజయావకాశం

శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తున్నారు. నిరంతరం ఏవో ఒక కార్యక్రమాలతో ప్రజల్లో మమేకమవుతూ వచ్చారు. రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమాలతో పాటు - నవరత్నాలు పథకాలను వివరిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. ఫలితంగా గెలిచే అవకాశం ఉంది. శింగనమల సీటు గెలుపుపై పాత సెంటిమెంట్‌ ప్రకారం వైఎస్సార్‌ సీపీ కూడా అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు.