Begin typing your search above and press return to search.

విమానానికి మంటలు.. అయినా అంతా సేఫ్

By:  Tupaki Desk   |   27 Jun 2016 6:39 AM GMT
విమానానికి మంటలు.. అయినా అంతా సేఫ్
X
ఈ మధ్య కాలంలో తరచూ చోటు చేసుకుంటున్న విమాన ప్రమాదాల కారణంగా.. విమానాలంటేనే భయపడే పరిస్థితి. చూసేందుకు గంభీరంగా కనిపించే పే..ద్ద విమానాలు సైతం చిన్న పక్షి కారణంగా కూడా తీవ్ర ప్రమాదానికి గురి కావటం మామూలే. ఇక.. సాంకేతిక సమస్యలతో పొంచి ఉండే ముప్పు అంతాఇంతా కాదు. ఇక.. ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే విమానంలో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారిపోతుంటాయి.

ప్రమాదానికి గురైన విమానం నుంచి సేఫ్ గా బయటపడటం అంత సులువేం కాదు. అప్పుడప్పుడు అదృష్టవశాత్తు అలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా అలాంటి అనుభవమే సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎదురైంది. విమానంలో మంటల్లో చిక్కుకున్నా.. ప్రయాణికులకు ఏం కాకుండా సేఫ్ గా బయటపడ్డారు. దాంగి విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున ఇటలీలోని మిలాన్ కు వెళ్లాల్సిన విమానం బయలుదేరింది.

అయితే.. ప్రయాణం మొదలైన కొద్దిసేపటికి ఇంజిన్ లో సమస్య వచ్చిందని.. అందుకే విమానాన్ని సింగపూర్ కు తీసుకెళుతున్నట్లుగా విమాన సిబ్బంది పేర్కొన్నారు. తెల్లవారుజామున 2.05 గంటలకు బయలుదేరిన విమానం.. తిరిగి ఉదయం 7 గంటల ప్రాంతంలో సింగపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఫ్లైట్ కుడి వైపున్న రెక్కలకు మంటలు చెలరేగాయి. దీంతో.. విమానంలోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు చెందారు. అయితే.. మంటలు రేగిన వెంటనే వాటిని విమానసిబ్బంది ఆర్పివేయటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సేఫ్ గా విమానం నుంచి బయటకు రావటంతో బతుకుజీవుడా అంటూ పెద్ద ఎత్తున నిట్టూర్పు విడిచారు. మంటలు చెలరేగిన తర్వాత ఎలాంటి గాయాల్లేకుండా బయట పడటంపై పలువురు ప్రయాణికులు తీవ్రభావోద్వేగానికి గురి అవుతున్న పరిస్థితి.