Begin typing your search above and press return to search.

జపాన్.. సింగపూర్ ప్రధానులు రానట్లే

By:  Tupaki Desk   |   11 Oct 2015 4:46 AM GMT
జపాన్.. సింగపూర్ ప్రధానులు రానట్లే
X
అంగరంగ వైభవంగా.. సమీప భవిష్యత్తులో ఎవరూ చేయలేనంత గ్రాండ్ గా.. భారీగా ఏపీ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా.. జపాన్ ప్రధాని.. సింగపూర్ ప్రధాని అవుతారన్న అంచనాలు ఉన్నాయి. ప్రధాని మోడీ విశిష్ఠ అతిధిగా వచ్చినా.. మరో రెండు దేశాల ప్రధానులు స్వయంగా కార్యక్రమానికి రావటం చిన్న విషయం కాదన్న మాట వినిపించింది.

అయితే.. అలాంటి పరిస్థితి ఉండదన్న మాట చంద్రబాబు తాజా వ్యాఖ్యల్లో స్పష్టమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన ఏపీ క్యాబినెట్ భేటీ లో చర్చించిన అంశాల గురించి దాదాపు గంటపాటు విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ శంకుస్థాపన గురించి ఆయన చాలా డీటైల్డ్ గా మాట్లాడారు.

ఈ సందర్భంగా జపాన్.. సింగపూర్ ప్రధానుల రాక గురించి ఆయన అస్సలు ప్రస్తావించలేదు. జపాన్.. సింగపూర్ మంత్రులు మాత్రమే రానున్నట్లు వెల్లడించారు. ఒకవేళ ప్రధానులు వస్తుంటే.. దాని గురించి గొప్పగా ప్రస్తావించే వారు. అలాంటిదేమీ లేకుండా.. ప్రధానుల ప్రస్తావన తీసుకురాకుండా కేవలం ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు వస్తారంటూ.. ప్రధాని మోడీ షెడ్యూల్ గురించి వివరంగా వివరాలు వెల్లడించటం చూసినప్పుడు.. ఈ రెండు దేశాల ప్రధానులు శంకుస్థాపన కార్యక్రమానికి రావటం లేదన్న విషయం అర్థమవుతుంది.