Begin typing your search above and press return to search.

అమ్మ స్విట్జర్లాండ్.. ఎంత నాటకం ఆడావ్

By:  Tupaki Desk   |   24 Jun 2016 9:32 AM GMT
అమ్మ స్విట్జర్లాండ్.. ఎంత నాటకం ఆడావ్
X
కనిపించే శత్రువుల కంటే.. స్నేహం నటించి దెబ్బ తీసేవాడే అసలుసిసలు ప్రమాదమంతా. అలాంటోడిని ఎంత దూరం పెడితే అంత మంచిది. ఇప్పుడు భారత్ పరిస్థితి కూడా ఇంచుమించే ఇదే తీరులో ఉంది. అను సరఫరాదారుల బృందంలో సభ్యత్వం కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పొరుగున ఉన్న డ్రాగన్ దేశమైన చైనా మనల్ని వ్యతిరేకిస్తున్న సంగతి బహిరంగంగానే తెలుసు.

అందులో ఎలాంటి సందేహాల్లేవు. నిజానికి ఈ సభ్యత్వం మీద చైనా మనకు మద్దతు ఇస్తేనే షాక్ తినాలి. ఒకపక్క చైనా.. పాక్ వ్యతిరేకతలే కాదు.. మనతో మంచిగా ఉంటూ.. సత్ సంబంధాలు కోరుకుంటున్నట్లగా చెప్పే బుజ్జి దేశమైన స్విట్జర్లాండ్ వెన్నుపోటు పొడిచినంత పని చేసింది. చైనాతో గొంతు కలిపి భారత్ పెట్టుకున్న దరఖాస్తును వ్యతిరేకించింది. ఎన్ పీటీలో లేని దేశాలకు ఎన్ ఎస్ జీలో సభ్యత్వం ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది కూడా.

స్విట్జర్లాండ్ దెబ్బకు భారత్ కు ఉన్న అవకాశాలు మరింతగా సన్నగిల్లాయి. స్విస్ వ్యతిరేకంచటంపై ఇంతగా ఫీల్ కావాల్సిన అవసరం ఎందుకంటే.. ఈ నెల మొదట్లో భారత ప్రధాని మోడీ ఆ దేశానికి వెళ్లి.. ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ జీలో భారత్ దరఖాస్తు చేసుకుందన్న విషయాన్ని చెప్పి.. మద్దతు కోరినప్పుడు అండగా ఉంటామని చెప్పి.. ఈ రోజు డ్రాగన్ తో చేతులు కలపటం దొంగ దెబ్బ కాక మరేమవుతుంది?