Begin typing your search above and press return to search.

ఇది కూడా జగన్‌ పాపమే అని అంటారేమో?

By:  Tupaki Desk   |   6 Oct 2016 4:47 AM GMT
ఇది కూడా జగన్‌ పాపమే అని అంటారేమో?
X
చంద్రబాబునాయుడుకు ఒక రకంగా ఎదురుదెబ్బ తగిలింది. సింగపూర్‌ ప్రభుత్వంలో నేను ఎంత చెబితే అంతే అన్నట్లుగా చంద్రబాబునాయుడు డాంబికాలు చెప్పుకుంటూ ఉంటారు... అలాంటిది ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సింగపూర్‌ ప్రధాని కనీసం అమరావతికి రాకపోవడం అనేది అచ్చంగా చంద్రబాబు వైఫల్యమే అవుతుందని జనం అనుకుంటున్నారు. భారత పర్యటనలో ఉన్న సింగపూర్‌ ప్రధాని మామూలుగా అయితే.. అమరావతి పర్యటనకు కూడా రావాల్సి ఉంది. అయితే.. ఆయన రావడం లేదని అమరావతి ట్రిప్‌ క్యాన్సిల్‌ చేసుకున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఎందుకిలా జరిగింది. సింగపూర్‌ వంటి క్రమశిక్షణ గల దేశం ప్రధాని చివరినిమిషంలో ఇలా క్యాన్సిల్‌ చేసుకోవడం ఏంటి? అని ఎవరికైనా అనిపిస్తుంది.

అయితే సింగపూర్‌ కంపెనీలు - అక్కడి ప్రభుత్వం భాగస్వాములుగా అమరావతి నిర్మాణం చేస్తాం అంటూ చంద్రబాబు ప్రకటించిన స్విస్‌ ఛాలెంజ్‌ విధానం రచ్చకెక్కినందువల్లనే సింగపూర్‌ ప్రధాని భయపడిపోయారని జనం అనుకుంటున్నారు.

నిజానికి స్విస్‌ ఛాలెంజ్‌ అనే కుట్రపూరితమైన టెండర్ల ప్రక్రియ ద్వారా అవినీతికి పాల్పడడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారించిన ధర్మాసనం కూడా.. స్విస్‌ ఛాలెంజ్‌ అనే పద్ధతి మీదనే అనేక సందేహాలు వ్యక్తం చేసింది. అంత గుంభనంగా ఎందుకు వ్యవహారాలు నడిపిస్తున్నారంటూ ప్రశ్నించింది. మొత్తానికి టెండర్ల ప్రక్రియకు విరామం పడినట్లే. అంటే అసలు కోర్టు తీర్పులు వెలువడి.. వ్యవహారం ఫైనలైజ్‌ అయ్యేసరికి ఏంజరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అందుకే సింగపూర్‌ ప్రధాని తన పరువుకు భంగం రాకుండా పర్యటన రద్దు చేసుకుని ఉంటారని జనం అనుకుంటున్నారు.

అయితే ఈ పర్యటన రద్దు వ్యవహారాన్ని కూడా జగన్‌ పాపం కింద చంద్రబాబు ప్రచారం చేస్తారేమో అని జనం అనుకుంటున్నారు. ప్రభుత్వం పరువు తీయడానికే జగన్‌ కేసులు వేయిస్తున్నాడని, అవినీతిని ఎత్తిచూపితే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించడం.. చంద్రబాబుకు అలవాటు అయిపోయిందని.. ఆ నేపథ్యంలో.. సింగపూర్‌ ప్రధాని పర్యటన రద్దును కూడా జగన్‌ పాపంగా చంద్రబాబు అభివర్ణించినా ఆశ్చర్యం లేదని జనం జోకులేసుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/