Begin typing your search above and press return to search.

జనవరి నుంచి రాజధాని నిర్మాణం

By:  Tupaki Desk   |   28 July 2015 11:38 AM GMT
జనవరి నుంచి రాజధాని నిర్మాణం
X
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా కొన్ని లక్ష్యాలను సీఆర్ డీ ఏకి సింగపూర్ కో ఆపరేషన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ అప్పగించింది. కేపిటల్ సిటీలో రూపొందించాల్సిన ప్రణాళిక, నీరు, చెత్తశుద్ధి కర్మాగారాల నిర్మాణం, హైటెన్షన్ కేబుళ్ల మళ్లింపు తదితర పనులను పూర్తి చేయాలని నిర్దేశించింది. ఇందుకు గడువు కూడా విధించింది.

ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి 50 శాతం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేయాలని తేల్చి చెప్పింది. దాంతో, అమరావతి నగర శంకుస్థాపన జరిగిన అక్టోబరు 22వ తేదీ తర్వాత నివాస ప్రాంతాలను జోనింగ్ చేసి ప్లాట్ల కేటాయింపు ప్రారంభిస్తారు. మొత్తం కార్యాచరణ ప్రణాళికను 2016 జనవరి నుంచి అమలు చేయాలని నిర్దేశించింది. ఇందులో భాగంగా, వచ్చే జూన్ నాటికి నీటి శుద్ధి కర్మాగారాల నిర్మాణం పూర్తి కావాలని, ఈ ఏడాది చివరి నాటికి హైటెన్షన్ విద్యుత్తు కేబుళ్ల మళ్లింపును పూర్తి చేయాలని నిర్దేశించింది. రాజధానిని పూర్తి చేయడానికి సింగపూర్ ప్రభుత్వం తొలి దశకు మూడేళ్ల గడువును పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణం తొలి దశ పూర్తి స్థాయిలో జనవరి 2016 నుంచి ప్రారంభం అవుతుందని సింగపూర్ నిపుణులు స్పష్టం చేశారు.