Begin typing your search above and press return to search.

దేశంలో ఒంటరి మహిళలు పెరిగిపోతున్నారు, కారణమేంటంటే..!

By:  Tupaki Desk   |   31 July 2022 2:30 AM GMT
దేశంలో ఒంటరి మహిళలు పెరిగిపోతున్నారు, కారణమేంటంటే..!
X
అమ్మాయిలు.. తెలిసీ తెలియని వయసు నుంచే తమ కలల రాకుమారుడి గురించి కలలు కంటుంటారు. పెరుగుతున్న కొద్దీ వారితో పాటు వారికి కాబోయే వాడి గురించి ఆశలూ పెరుగుతుంటాయి. కానీ ఒక వయస్సొచ్చాక.. లోకం పోకడ తెలిశాక.. చూడకూడని ఘటనలు చూశాక.. వినకూడనివి విన్నాక.. కొందరి జీవితాలు.. మరికొందరి అనుభవాలు తెలిశాక వారు పెళ్లి గురించి కట్టుకున్న కలల సౌధం ఒక్కసారిగా కూలిపోతుంది. ఇక తమ జీవితంలో పెళ్లికి చోటుండకూడదని దృఢ నిశ్చయం తీసుకుంటారు. ఇలా నేటి సమాజంలో చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం కంటే.. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఇటీవల ప్రభుత్వ సర్వేలో ఈ విషయమే తేలింది.

స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ జులైలో విడుదల చేసిన 'యూత్ ఇన్ ఇండియా 2022' రిపోర్టులో, అన్ని వయసుల వారిలోనూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండే స్త్రీ, పురుషుల సంఖ్య పెరుగుతోందని వెల్లడైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 25-29 సంవత్సరాల వయసులో ఉన్నవారు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదని, 2011-2019 మధ్య అవివాహిత మహిళల శాతం దాదాపు రెండింతలు పెరిగిందని, పురుషుల్లో 12 శాతం పెరిగిందని ఈ సర్వే తెలిపింది.

ఈ ఏడాది మార్చిలో విడుదలైన 'శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే రిపోర్ట్ 2019' ప్రకారం, దేశంలో ఒంటరి పురుషులు కేవలం 1.5 శాతం ఉండగా, ఒంటరి మహిళలు 5.2 శాతం ఉన్నారు. ఒంటరి మహిళలు అంటే విడాకులు తీసుకున్నవారు, భర్త చనిపోయినవారు లేదా పెళ్లయి వేరుగా ఉన్నవారు.

రాష్ట్రాల ప్రకారం చూస్తే, ఒంటరి మహిళల శాతం కేరళ, తమిళనాడులలో ఎక్కువగా ఉంది. కేరళలో 9.2 శాతం, తమిళనాడులో 8.9 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 7.6, 7.0 శాతాలుగా నమోదైంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఒంటరిగా ఉన్న పురుషుల సంఖ్య కన్నా మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది.

మహిళలు ఒంటరిగా ఉండాలనుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. లవ్ మ్యారేజ్ అయినా.. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా స్త్రీలకు ఎన్నో ఆంక్షలు, పరిమితులు ఉండటం వల్లే వాళ్లు వివాహ బంధానికి నో అంటున్నారని తెలిపారు. ఇష్టం లేకపోయినా పిల్లల్ని కనడం, వాళ్ల బాధ్యతలను స్త్రీలు మాత్రమే నెత్తిన వేసుకోవడం, పర్సనల్ స్పేస్ లేకపోవడం వంటి కారణాలతో కొందరు పెళ్లంటే భయపడుతున్నారని చెప్పారు.

అయితే కొందరు మాత్రం తమకు నచ్చిన వాడు, తమ మనసును అర్థం చేసుకుని, ఆడవాళ్లని మనుషులుగా గౌరవించే వాళ్లు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటామంటున్నారు. కానీ ఈ సమాజ పోకడ తమపై రుద్దే వాళ్లు మాత్రం తమకు వద్దని బల్లగుద్ది చెబుతున్నారు. తమ ముందు తరం ఆడవాళ్లు చాలా నష్టపోయారని.. పరువు కోసం, తల్లిదండ్రుల కోసం, కుటుంబం కోసం కష్టాలు పడుతూ నచ్చని పనిని చేస్తూ తమ జీవితాన్ని నరకం చేసుకుని బతికున్న శవాల్లా గడిపారని.. తాము మాత్రం అలా ఉండబోమని చెబుతున్నారని నిపుణులు అంటున్నారు.