Begin typing your search above and press return to search.

సినీరంగం సవతిబిడ్డ..ఐటీరంగం కన్నబిడ్డా?

By:  Tupaki Desk   |   28 July 2017 5:30 PM GMT
సినీరంగం సవతిబిడ్డ..ఐటీరంగం కన్నబిడ్డా?
X
ఇన్నాళ్లూ తెలుగు సినీ ప్రపంచానికి డ్రగ్ రాకెట్, మాఫియాలతో ఉన్న సంబంధాల గురించిన కబుర్లు అందరినీ కుదిపేస్తూ వచ్చాయి. అయితే తాజాగా ఇప్పుడు ఐటీ రంగం మీదికి అందరి దృష్టి మళ్లుతోంది. సినిమా ప్రపంచంలో కేవలం 12 మంది నోటీసులు అందుకుని విచారణ ఎదుర్కొంటున్నందుకే... కొన్ని వేల గంటల న్యూస్ బులెటిన్లు ఆ పర్వం గురించి హోరెత్తిస్తున్నాయి. అయితే ఐటీ రంగంలో డ్రగ్ వాడకం దార్లుగా కాల్ లిస్టుల్లో దొరుకుతున్న వాళ్లు 1500 మందికి పైగా ఉంటారని, నిర్ఘాంత పరిచే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. మరి ఈ 1500 మందిని కూడా సిట్ విచారించడం అంటే.. అది నిందితులకు కాదు కదా.. సిట్ కే పెద్ద శిక్ష విధించినట్లు అవుతుందనే జోకులు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ జోక్యం గురించి వార్తలు వస్తున్నాయి. ఐటీ హబ్ గా హైదరాబాదు నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజి దెబ్బ తినకుండా.. ఐటీ రంగం లోని డ్రగ్ వాడకందార్ల విచారణ అంతా గోప్యంగా జరగాలని, వీలైనంత వరకు కంపెనీల పేర్లు బయటకు రాకుండా, వారి వారి పై అధికార్లతోనే వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ అంశం దగ్గరే పలు విమర్శలు కూడా వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఐటీరంగాన్ని కన్నబిడ్డలాగా చూసుకుంటూ.. సినీ రంగాన్ని సవతి బిడ్డలాగా చూస్తున్నదనే వాదన ఒకటి బలంగా వినిపిస్తోంది. ఐటీ రంగానికి హైదరాబాద్ హబ్ అని ప్రభుత్వం ఎలా భావిస్తున్నదో.. సినీ రంగానికి కూడా హైదరాబాదు అంతే కీలకమైన కేంద్రంగా ఉంది. ఇవాళ దేశం మొత్తం గర్వించే సినిమాలు కూడా టాలీవుడ్ కేంద్రంగానే తయారవుతున్నాయి. నోటీసులు సర్వ్ చేయడం మీడియాలో మితిమీరిన ప్రచారం జరగడం ... ఇలా పరువు పోతునన తరుణంలో సినీ పరిశ్రమ కూడా ఇదే విషయమై గగ్గోలు పెట్టింది. లక్షలమంది ఆధారపడి బతుకుతున్న సినీ పరిశ్రమలో 12 మందికి నోటీసులు వస్తే.. దానికి లభిస్తున్న ప్రచారం మాత్రం.. యావత్తు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ డ్రగ్స్ తీసుకుంటున్నారేమో అనే అపోహలు కలిగించే స్థాయికి చేరిపోయిందని పరిశ్రమ వారంతా విన్నవించుకున్న సర్కారు పట్టించుకోలేదు. మరోవైపు విచారణాధికారులు సినిమా పరిశ్రమను తాము టార్గెట్ చేయలేదని, ఆంధ్రా తెలంగాణ తేడాలు తీసుకురావద్దని, మూలాలు తెలుసుకోవడానికే విచారిస్తున్నాం అని... ఇలా సన్నాయి నొక్కులు నొక్కారు.

విచారణాధికారులు నిజాయితీని హర్షిద్దాం. మరి ఇవాళ ఐటీ రంగాన్ని గోప్యంగా విచారించాలనే మాటల మతలబు ఏమిటి? డ్రగ్స్ తీసుకునే ఉద్యోగులు మెజారిటీగా ఉన్న ఐటీ కంపెనీల పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదు. ఐటీ రంగానికి అయితే పరువుపోతుంది.. సినీ రంగానికి అయితే పరువు ఉండదు అని ప్రభుత్వం భావిస్తోందా? అని సినీ జీవులు ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు. వారి ఆవేదన అర్థవంతమైనదే కదా?