Begin typing your search above and press return to search.

సెల్ఫీలతో సుబ్బరాజుకు చుక్కలు చూపించారు

By:  Tupaki Desk   |   22 July 2017 5:27 AM GMT
సెల్ఫీలతో సుబ్బరాజుకు చుక్కలు చూపించారు
X
తెలుగు సినీ ఇండస్ర్టీని కుదిపేస్తున్న డ్రగ్స్‌ వ్యవహారంలో విచారణకు హాజరైన నటుడు సుబ్బ రాజుకు సిట్‌ అధికారులు చుక్కలు చూపించారు. శుక్రవారం ఎక్సైజ్‌ సిట్‌ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. ఉదయం 10-30నుంచి అర్థరాత్రి దాకా ఆయన్ను విచారించారు. విచారణ చేసే క్రమంలో సుబ్బరాజుకు సిట్‌ అధికారులు ఇరుకునపెట్టే ప్రశ్నలు - అందుకు తగ్గ ఆధారాలు చూపించి టెన్షన్ పెట్టారట. దీంతో ఒకానొక దశలో సుబ్బరాజుకు బీపీ డౌన్‌ అయిపోవడంతో కాసేపు విరామమిచ్చి కోలుకునేలా చేసి మళ్లీ విచారణ మొదలుపెట్టారని దాదాపు అన్ని తెలుగు పత్రికలూ రాసుకొచ్చాయి.

సిట్ అధికారులు సుబ్బరాజుకు సుమారు 60 ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే.. మంచి నటుడయిన సుబ్బరాజు ప్రతి ప్రశ్నకు జవాబు దాటవేసే ప్రయత్నం చేశారట. కెల్విన్‌ ఎవరో తెలుసా? అన్న ప్రశ్నకు సైతం సుబ్బరాజు దాటవేసే ప్రయత్నం చేయడంతో కెల్విన్‌ తో ఆయన ఉన్న సెల్ఫీని ఎక్సైజ్‌ సిట్‌ అధికారులు సుబ్బరాజు ముందు ఉంచారట. దీంతో సుబ్బరాజు నోరు విప్పక తప్పలేదని టాక్. ఆ తరువాత కూడా పలు ప్రశ్నలకు ఆయన తెలియదని సమాధానం చెప్పగా ఆధారాలు చూపుతూ సుబ్బ రాజుకు అధికారులు చుక్కలు చూపించారనే తెలుస్తోంది. సుబ్బరాజు కూడా డొంక తిరుగుడు సమాధానాలు... సమాధానానికి ఎక్కువ సమయం తీసుకోవడం వంటి ఎత్తుగడలతో వారికి విసుగు తెప్పించాడని... అందుకే ఆయన విచారణకు సుమారు 13 గంటల సమయం పట్టిందని అంటున్నారు. అంతేకాదు... తమ వద్ద ఆధారాలు ఉండడమే కాకుండా విచారణలో సుబ్బరాజు వ్యవహరించిన తీరు వల్ల కూడా అధికారులు సుబ్బరాజు డ్రగ్స్ కేసులో కీలక నిందితుడని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

నిజానికి తొలిరోజు విచారణలో పూరీ జగన్నాథ్ కు సుమారు 100 ప్రశ్నలు వేశారు. విచారణకు 11 గంటల సమయం పట్టింది. రెండో రోజు శ్యాం.కె.నాయుడుకు 60 ప్రశ్నలు సంధించగా ఆయన విచారణ 5.30 గంటలపాటు సాగింది. అయితే.. సుబ్బరాజుకు 60 ప్రశ్నలు సంధించగా 13 గంటల పాటు విచారణ సాగింది.

మరోవైపు పూరీ జగన్నాథ్‌ - శ్యాం కె నాయుడి నుంచి రాబట్టిన సమాచారంతో సిట్‌ ఓ ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించుకుని.. దాన్ని సుబ్బరాజు ముందు ఉంచినట్లు సమాచారం. సుబ్బరాజు సిట్‌ కు సహకరించకపోవడంతో ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ స్వయంగా రంగంలోకి దిగారట. సెకండ్‌ సెషన్‌ లో ఆయన నేతృత్వంలో ఎక్సైజ్‌ సిట్‌ సుబ్బరాజును విచారణ జరిపింది. బ్యాంకు లావాదేవీలు - ఫోటోలు ముందుంచి సుబ్బరాజును దారిలోకి తెచ్చినట్లు సమాచారం. అతని బ్లడ్‌ శాంపిల్‌ ను కూడా సేకరించింది. దీంతో, అప్పటిదాకా సమాధానాలు దాటవేసిన సుబ్బరాజు సిట్‌ అధికారుల కు కొంత విలువైన సమాచారాన్ని చెప్పినట్లు తెలుస్తోంది.

సుబ్బరాజుకు అడిగిన ప్రశ్నల్లో కొన్ని..

* మీకు డ్రగ్స్‌ అలవాటు ఉందా?

* పూరీ జగన్నాథ్‌ తో సన్నిహితంగా ఉంటారా?

* పూరీ ఎప్పుడైనా డ్రగ్స్‌ తీసుకున్నారా?

* పూరీతో కలిసి బ్యాంకాక్‌ వెళ్లినప్పుడు ఏ ఫోన్‌ నెంబర్లు వాడారు? అక్కడ ఏం చేశారు?

* అక్కడ పూరీ విదేశీ నెంబర్లు వాడారు.. మీకు తెలుసా?

* కెల్విన్‌ తెలుసా? ఎలా పరిచయం అయ్యాడు? పూరీ - శ్యామ్‌ లతో పాటు మీరూ కెల్విన్‌ ని కలిసే వారా?

* పూరీ ఇంట్లో పార్టీలో ఏం జరిగేది? మీరు డ్రగ్స్‌ పార్టీ లకు వెళ్లేవారా?

* కెల్విన్‌ తో మీరు డైరెక్ట్‌ గా డీల్‌ చేసేవారా?

* కెల్విన్‌ కు మీరు ఎవరెవరిని పరిచయం చేశారు?

* మీకు ఎంత మంది ఈవెంట్‌ ఆర్గనైజర్లు తెలుసు?

* సినీ పరిశ్రమలో ఎవరెవరికి డ్రగ్స్‌ అలవాటు ఉంది?