Begin typing your search above and press return to search.

నాయకులైతే ఇళ్లకు వెళ్లి విచారిస్తారా?

By:  Tupaki Desk   |   30 July 2017 12:15 PM GMT
నాయకులైతే ఇళ్లకు వెళ్లి విచారిస్తారా?
X
డ్రగ్స్ వ్యవహారాన్ని ఈసారి సీరియస్ గా తీసుకుని, హైదరాబాదు నగరాన్ని డ్రగ్ విముక్తి నగరంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్న ఎక్సయిజు శాఖ సిట్ అధికారులు ఈ విషయంలో పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వలేదు. కానీ.. వారు చెబుతున్న కొన్ని మాటలను బట్టి రకరకాల సందేహాలు రేకెత్తుతున్నాయి. ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటిదాకా డ్రగ్స్ విచారణల నిమిత్తం కొత్తగా ఎవ్వరికీ నోటీసులు ఇవ్వలేదని, ఇక మీదట చేయబోయే విచారణలు అన్నింటినీ గోప్యంగా పూర్తిచేస్తాం అని మాత్రం అధికారులు ప్రకటించారు.

‘గోప్యంగా’ అనే మాట మీదనే అన్ని రకాల సందేహాలు నెలకొని ఉన్నాయి. కెల్విన్ కాల్ డేటా ఆధారంగా నోటీసులు ఇచ్చాం అని చెప్పిన సిట్ అధికారులు.. కాల్ డేటాలో కేవలం సినిమా రంగం వాళ్ల పేర్లు మాత్రమే ఉన్నాయా... ఆ రంగంలోని వారికి మాత్రమే ఎందుకు నోటీసులు ఇచ్చారు.. మిగిలిన రంగాల్లోని వారికి ఎందుకు తొలివిడతలో నోటీసులు ఇవ్వలేదు అనే ప్రశ్నలకు ఇప్పటిదాకా క్లారిటీగా సమాధానం చెప్పలేదు.

అదే సమయంలో.. ఒకవైపు సినీ రంగంలోనూ.. ఇప్పటిదాకా జరిగిన విచారణకు వచ్చిన వారు మరింత మంది డ్రగ్స్ వాడే ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. వారి మాటలు మొత్తం వీడియోల్లో రికార్డయి ఉంటాయి కూడా! మరి ఆ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారించాల్సిన సమయం వచ్చేసరికి, ఎక్సయిజు అధికారులు చాలా లౌక్యంగా గోప్యత గురించి ప్రస్తావిస్తున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, వారి పిల్లలు అనేక మంది కూడా ఈ డ్రగ్స్ సాలెగూటిలో చిక్కుకుని ఉన్నట్లుగా తెలుస్తోంది. వారందరూ రచ్చకెక్కకుండా గోప్యత గొడుగు కిందికి వచ్చేస్తారన్నమాట.

గోప్యంగా విచారించడం అంటే ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అంటే బహుశా ఈ నాయకులను, సినిమారంగంలోని ఇతర ప్రముఖులను వారి ఇళ్లకే వెళ్లి విచారిస్తారేమోనని.. ఎప్పుడు ఎవరి ఇంటికి వెళ్లి విచారిస్తారు.. లిస్టులో ఎవరెవరు ఉన్నారు అనే సంగతి ఎక్కడా మీడియాకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. తొలివిడతలో విచారణకు వచ్చిన వారు మాత్రమే బలిపశువులు అయ్యారని, అంతకు మించిన డ్రగ్స్ వాడే పెద్దలంతా ఇలాంటి వెసులుబాటు పొందుతున్నారని కూడా జనంలో సానుభూతి మాటలు వినవస్తున్నాయి.