Begin typing your search above and press return to search.

ఆ కంప్లయింట్లన్నీ బాబు పాలనకు రిఫరెండమేనా?

By:  Tupaki Desk   |   8 July 2017 6:19 AM GMT
ఆ కంప్లయింట్లన్నీ బాబు పాలనకు రిఫరెండమేనా?
X
నవ్యాంధ్రలో భూబకాసురులు సామాన్య జనాన్ని తోడుకు తింటున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో ఒకప్పుడు హైదరాబాదుకే పరిమితమైన భూ అక్రమాలు ప్రస్తుత నవ్యాంధ్రలో అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయి. పల్లెలు - పట్టణాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా భూ వివాదాలు - అక్రమాలే. ముఖ్యంగా నవ్యాంధ్రలోని అతి పెద్ద నగరం విశాఖలో ఇది మరింత ఎక్కువగా ఉంది. అక్కడ ఇటీవల బయటపడిన వేల కోట్ల భూ కుంభకోణం తెలిసిందే. అందులో పాలక పార్టీ పెద్దల, నేతల హస్తంపైనా ప్రజల్లో అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలోనే భూముల అన్యాక్రాంతం లెక్కలు తేల్చడానికంటూ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం నియమించిన సిట్‌ కమిటికి ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

ఇప్పటివరకు ఈ కమిటీకి 845 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా బాధితులు, ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ ఈ స్థాయిలో భూ ఆక్రమణలు లేవని... ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని మండిపడుతున్నారు. నేతల అండతో భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారని.. బలహీనుల ఆస్తిపాస్తులను కబ్జాలు చేస్తున్నారని, బలవంతంగా లాక్కోవడమో లేదంటే తప్పుడు పత్రాలతో చేజిక్కించుకోవడమో చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా భూముల వ్యవహారంలో భారీగా ఫిర్యాదులు వస్తుండడమే కాకుండా ఆ సందర్భంగా ఫిర్యాదుదారులు ప్రభుత్వానికి, చంద్రబాబుకు, స్థానిక నేతలకు శాపనార్థాలు పెడుతుండడంతో టీడీపీ వర్గాలు తెగ టెన్షన్ పడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది నిదర్శనమని.. వచ్చే ఎన్నికల్లో తమ పని అయిపోయినట్లేనని టీడీపీ నేతలు భయపడుతున్నారట.

విశాఖలో తొలుత రూ.2500 కోట్లు విలువచేసే ప్రభుత్వ భూముల రికార్డులు ట్యాంపరింగ్‌ జరిగిందని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించారు. ఆ తరువాత మధురవాడ, కొమ్మాదిలో 274 ఎకరాల ప్రభుత్వ భూమి రికార్డులు ట్యాంపరింగ్‌ జరిగినట్లు గుర్తించారు. తదుపరి మరో నాలుగు కేసుల్లో సుమారు 349 ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులు ట్యాంపరింగ్‌ జరిగినట్లు సర్వే బృందాలు నిర్ధారించగా సిట్‌ కూడా అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వం నియమించిన సిట్‌ కమిటికి ఇప్పటి వరకు 845 ఫిర్యాదులు అందాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు ఫిర్యాదుల సంఖ్య ఇంకె పెరగడం ఖాయమని.. వీటిపై విచారణకు కూడా చాలా సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో కొందరు నేతలపై నేరుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆధారాలతో సహా ఆయా నేతలపై ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.