Begin typing your search above and press return to search.

యూపీలో ఓడితే బీజేపీ పరిస్థితి ఏంటి... ?

By:  Tupaki Desk   |   16 Jan 2022 12:30 AM GMT
యూపీలో ఓడితే బీజేపీ పరిస్థితి ఏంటి... ?
X
దేశానికి గుండె కాయ లాంటి రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. అక్కడ గెలుపే గెలుపు. రేపటి రోజున దేశానికి అదే కీలక మలుపు అవుతుంది. అలాంటి చోట ఇప్పటికి మూడు సార్లు బీజేపీ వరమాలను వేయించుకుంది. 2014 నుంచి అదే పనిగా గెలుస్తూ వస్తోంది. కానీ 2022 మాత్రం ఆ సెంటిమెంట్ ని తిరగరాయనుంది అంటున్నారు. సర్వేలు బీజేపీదే గెలుపు అని చాటుతున్నా క్షేత్ర స్థాయిలో సీన్ మాత్రం వేరేగా ఉందని అంటున్నారు. అక్కడ ఎస్పీదే సక్సెస్ అని కూడా చెబుతున్నారు.

దాంతో కమలనాధుల్లో కలవరం పెద్ద ఎత్తున ఉందిపుడు. బీజేపీ 2024 నాటి జాతకాన్ని రెండేళ్ల ముందే యూపీ చెబుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నార్. అసలు యూపీ ఎన్నికలకు బీజేపీకి 2024 ఎన్నికలకు ఎందుకు అంత కనెక్షన్ అంటే చెప్పడానికి అయితే చాలానే ఉంది. యూపీలో మొత్తం 80 ఎంపీ సీట్లు ఉన్నాయి.

మరి అక్కడే బీజేపీ బోల్తా కొడితే రేపటి రోజున ఢిల్లీ పీఠం ఎలా అధిష్టిస్తుంది. అందుకే యూపీలో ఓడిపోకూడదు దేవుడా అని బీజేపీ కోటి ప్రార్ధనలు చేస్తోంది. ఇక యూపీలో గెలిస్తే బీజేపీకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నారు. అందులో మొదటికి నాయకత్వం ఇంకా పెరుగుతుంది. రెండవసారి యోగీ చీఫ్ మినిస్టర్ అయితే ఆయన భావి భారత ప్రధాని అభ్యర్ధిగా ప్రమోట్ అవుతారు. అలా మోడీ తరువాత యోగీని ముందు పెట్టి మరిన్నాళ్ళు బీజేపీ తనదైన కాషాయ రాజకీయాలు చేయగలుగుతుంది.

అదే యూపీలో ఓడితే మాత్రం యోగీ మాజీ సీఎం అవుతారు. ఆయనే ఓడాక ఇక జాతీయ స్థాయిలో నాయకత్వానికి ఎదిగే చాన్స్ ఉండదు, మరో వైపు ఆ ఓటమి నీలినీడలు మోడీ మీదకు కూడా సోకుతాయని అంటున్నారు. ఆయన సమర్ధ నాయకత్వం మీద ఇమేజ్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు.

ఆ విధంగా కళ తప్పిన మోడీ షా ద్వయం 2024 నాటికి కేంద్రంలో మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకురాలేరు అన్న అనుమానలు కమలం పార్టీలో పెద్ద ఎత్తున వస్తాయి. దాంతో బీజేపీలో ఇతర నాయకుల నుంచి కూడా విమర్శలు మొదలవుతాయని అంటున్నారు. బీజేపీలో అంతర్గత విభేదాలు తలెత్తుతాయి అని కూడా అంటున్నారు. ఇప్పటిదాకా మోడీ, అమిత్ షాలు చెప్పిన మాటలను మొత్తం పార్టీ పాటించింది.

రేపటి రోజున సీన్ అలా ఉండకపోవచ్చు. మళ్లీ ఆరెస్సెస్ ప్రమేయం వస్తుంది. బీజేపీలో ఇతర సీనియర్ల గొంతులు లేస్తాయి. అంతే కాకుండా 2024 ఎన్నికలలో కూడా మోడీ, షాలకు పూర్తి ఆధిపత్యం దక్కకపోవచ్చు. ఒకవేళ బీజేపీ రెండు వందల సీట్లు గెలిచినా 2024 తరువాత మూడవ సారి ప్రధానిగా మోడీకి కానీ ఆయన తరువాత చాన్స్ అమిత్ షా కు కానీ దక్కకపోవచ్చు.

అంటే ఒక్క యూపీ బీజేపీలో చాలా లెక్కలను మార్చేస్తుంది అన్న మాట. దాంతోనే ఇపుడు బీజేపీ పెద్దలు పూర్తి ఫోకస్ ని యూపీ మీద పెట్టేశారు. సీట్లు ఎంత తగ్గినా బొటాబొటీ గా గెలిచినా కూడా యూపీని మాత్రం తమ చేతుల నుంచి జారిపోకుండా చూసుకోవాలనుకుంటున్నారు. మరి చూడాలి ఈ యూపీ ఫలితాలు ఎలా ఉంటాయో. ఏ పార్టీలలో ప్రకంపనలు రేపుతాయో.