Begin typing your search above and press return to search.

వివేకా హత్య అనంతరం అవినాశ్ ఏమేం చేసింది చెప్పిన నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డి

By:  Tupaki Desk   |   5 March 2022 2:50 AM GMT
వివేకా హత్య అనంతరం అవినాశ్ ఏమేం చేసింది చెప్పిన నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డి
X
సంచలనంగా మారిన వివేకా హత్యకు సంబంధించి ఇప్పటివరకు బయటకు వచ్చిన వాంగ్మూలాలు రేపిన కలకలం అంతా ఇంతా కాదు. ఇవి సరిపోదన్నట్లుగా తాజాగా వివేకా బావమరిది.. అల్లుడి అన్న అయిన నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి సీబీఐకి ఇచ్చేశారు. అంతేకాదు.. వివేకా హత్య వేళ.. తొలుత బయటకు వచ్చిన ‘గుండెపోటు’ ప్రచారాన్ని తెర పైకి తీసుకొచ్చింది అవినాశ్ అన్న విషయాన్ని ఆయన తెలియజేశారు. అంతేకాదు.. అవినాశ్ రెడ్డి.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి.. చిన్నాన్న మనోహర్ రెడ్డిల సమక్షంలోనే హత్య జరిగిన ప్రాంతంలోని ఆధారాల్నిధ్వంసం చేసినట్లుగా ఆయన చెప్పారు.

దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి.. ఎర్ర గంగిరెడ్డి ఆదేశాలతోనే అక్కడున్నరక్తాన్ని పని మనుషులు తుడిచినట్లుగా వెల్లడించారు. అవినాష్ రెడ్డి.. శివశంకర్ రెడ్డిలకు స్నేహితులైన ఉదయ్ కుమార్ రెడ్డిలు వివేకా భౌతికకాయానికి కట్లు కట్టటానికి అవసరమైన కాటన్.. బ్యాండేజీతో పాటు వైద్యుల్ని.. కాంపౌండర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతేకాదు వివేకాకు ఆయన అన్న కొడుకు జగన్ కు మధ్య విభేదాల గురించి వెల్లడించారు.

2004 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ కావాలని జగన్మోహన్ రెడ్డి పట్టుబడితే.. ఆ టికెట్ వివేకానందరెడ్డికి లభించింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వివేకా చేరటం జగన్ కు ఇష్టం లేదని.. అదే సమయంలో 2010లో జగన్ సొంతంగా పార్టీ ఏర్పాటు చేయటం వివేకాకు ఇష్టం లేదన్నారు.అందుకే పార్టీలో చేరలేదన్నారు.

2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో ఆయన విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయారని చెప్పారు. వివేకా సోదరుడు సుధీకర్ రెడ్డితో పాటు వివేకా అనుచరులు ఆయన్ను వైసీపీలో చేరాలని కోరినా మొదట వద్దనుకున్నారన్నారు. తర్వాత జగన్ సరేనని చెప్పటంతో 2012లో వివేకా వైసీపీలో చేరినప్పటికి వారి మధ్య మాత్రం విభేదాలు ఉండేవన్నారు.

వివేకా చనిపోయారని 2019 మార్చి 15న ఉదయం 6.18గంటలకు వివేకా పీఏ ఎంవీ క్రిష్ణారెడ్డి నుంచి తనకు ఫోన్ వచ్చిందని.. ఇదే విషయాన్ని అవినాశ్ రెడ్డి..వివేకా సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డిలు ఉదయం 6.26కు ఫోన్ చేశారన్నారు. అనంతరం తాను టైపిస్టు ఇనయతుల్లాకు ఫోన్ చేసి వివేకా ఇంటికి వెళ్లి చూసి ఏం జరిగందో చెప్పాలన్నాను. అనంతరం మా కుటుంబం మొత్తం రెండు వాహనాల్లో హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరాం.

వివేకా ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అవినాశ్ రెడ్డి నాకు ఫోన్ చేయలేదు.. సమాచారం ఇవ్వలేదు. ఆ సమయంలో ఆయనకు ఫోన్ చేస్తే తీయలేదన్నారు. తాను ఎర్ర గంగిరెడ్డికి ఫోన్ చేసి వివేకా మరణం గురించి చెబితే.. ఆయన చాలా తేలిగ్గా ‘‘అట్లానా’’ అని స్పందించటం తనకు చాలా ఆశ్చర్యమేసిందన్నారు. అంతేకాదు.. తనకున్న అనుమానం గురించి మరో కీలక అంశాన్ని ఆయన వెల్లడించారు.

హత్య జరగటానికి ముందు రోజు అంటే మార్చి 14న తన మనమరాలి పుట్టినరోజు అని.. హైదరాబాద్ రావాలని ఎర్ర గంగిరెడ్డితో పాటురాజారెడ్డి అనే వ్యక్తిని తాను మార్చి 12న ఆహ్వానించినట్లు చెప్పారు. తమ కుటుంబ సభ్యులు కాకుండా పులివెందుల నుంచి పిలిచింది వారిద్దరినే అని చెప్పారు. అయితే.. తనకుఅత్యవసరమైన పని ఉందని రాజారెడ్డికి గంగిరెడ్డి చెప్పారు. ఎంత పని ఉన్నా..మరెంత బిజీగా ఉన్నా.. మా ఇంట్లోజరిగే ఏ శుభకార్యానికి కూడా ఆయన హాజరు కాకుండా ఉండింది లేదు.

అలాంటిది రాలేనన్న విషయాన్ని నాతో నేరుగా చెప్పకుండా రాజారెడ్డికి చెప్పటం కాస్తంత ఆశ్చర్యానికి గురి చేసింది. వివేకా హత్య జరిగిన రోజు గంగిరెడ్డి పులివెందులలోనే ఉన్నారని పేర్కొన్నారు. వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి వాంగ్మూలం అవినాశ్ పాత్రపై మరిన్ని అనుమానాలు రేపేలా ఉన్నాయని చెప్పక తప్పదు.