Begin typing your search above and press return to search.

పాలిటిక్సు అంత ఈజీ కాదు శివాజీ

By:  Tupaki Desk   |   18 Aug 2016 7:19 AM GMT
పాలిటిక్సు అంత ఈజీ కాదు శివాజీ
X
నటుడు శివాజీ కొద్దికాలంలో రాజకీయాల్లో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఆయనేమీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాజకీయంగా మాత్రం లైమ్ లైట్ లో ఉండాలన్న ప్రయత్నమైతే చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం తరచూ ప్రెస్ మీట్లు పెడుతున్న శివాజీ కొద్దికాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు, రాజకీయంగా తనపై వస్తున్న విమర్శలు కూడా ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా పుష్కర స్నానానికి వచ్చి విలేకరులతో మాట్లాడిన సందర్భంలో ఆయనలోని ఆగ్రహం బయటపడింది. విజయవాడలో పుష్కర స్నానం చేసిన శివాజీ పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని మెచ్చుకున్నారు. అనంతరం వైసీపీ అభిమానులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు సోషల్‌ మీడియాలో తనకు కులాన్ని అంటగడుతూ పోస్టులు పెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటివి అరికట్టకపోవడం జగన్ కు మంచిది కాదని హెచ్చరించారు.

కాగా ప్రత్యేక హోదా విషయంలో కేవలం బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా చంద్రబాబుకు ఇబ్బంది లేకుండా శివాజీ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో పలువురు శివాజీ తీరును ఎండగడుతూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయన తీరును ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై శివాజీ తీవ్రంగా స్పందించారు. కేంద్రం ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తే సహించే ప్రసక్తే లేదన్నారు శివాజీ. తాను హోదా కోసం పోరాటం చేయకుండా మౌనంగా ఉండి ఉంటే బీజేపీలో తన స్థానం ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు శివాజీ.

శివాజీ తొలుత బీజేపీలో ఉండేవారు. అయితే బీజేపీలోనే ఉంటూ ఆ పార్టీని ఇబ్బందిపెట్టేలా మాట్లాడేవారు. దీంతో శివాజీ చంద్రబాబుకు కోవర్టుగా పనిచేస్తున్నారన్న అనుమానాన్ని అప్పట్లో కమలనాథులు వ్యక్తం చేశారు. అసలు బీజేపీతో శివాజీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. అయితే.. శివాజీ తాజా వ్యాఖ్యల తరువాత కూడా ఆయనపై సోషల్ మీడియాలో జోకులు కొనసాగుతున్నాయి. ఏ అర్హతలతో తనను నాయకుడుగా భావించుకుంటున్నాడో, వార్నింగ్ లు ఇస్తున్నాడో అర్ధం కావడం లేదని పలువురు పోస్టులు పెడుతున్నారు. దీంతో శివాజీ పరిస్థితిని చూస్తున్న రాజకీయ నేతలు ఈ తిప్పలన్నీ ఈయనకెందుకో అంటున్నారు. రాజకీయాలు అంత ఈజీ కాదు శివాజీ అంటూ తెలిసినవారు సలహాలు కూడా ఇస్తున్నారట.