Begin typing your search above and press return to search.

కోర్టులో లొంగిపోయిన కోడెల కొడుకు శివరాం..

By:  Tupaki Desk   |   1 Oct 2019 8:20 AM GMT
కోర్టులో లొంగిపోయిన కోడెల కొడుకు శివరాం..
X
ఏపీ మాజీ స్పీక‌ర్, దివంగ‌త నేత కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం కోర్టు ఎదుట మంగ‌ళవారం లొంగిపోయారు. కోడెల శివ‌ప్ర‌సాద‌రావు స్పీక‌ర్ పదవిలో ఉండగా కే ట్యాక్స్‌ పేరిట కోడెల శివరాం అనేక భూ కబ్జాలు, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోడెల బాధితులు కోడెల శివరాంపై వివిధ పోలీసు స్టేషన్లలో పిర్యాదులు చేయ‌గా పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే కోడెల శివరాం ఇంత‌కాలం పోలీసుల‌కు లొంగిపోలేదు. కోడెల శివరాంను విచార‌ణ‌కు రావాల‌ని పోలీసుల‌కు కూడా నోటీసులు పంపారు. అయినా శివ‌రాం స్పందించ‌లేదు.

త‌రువాత ఆయ‌న కొంత కాలం విదేశాల‌కు వెళ్ళారు. కోడెల కుటుంబంపై సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కేసులు వేయ‌డం, దీనికి సొంత పార్టీ అధిష్టానం ప‌ట్టించుకోక‌పోవ‌డం, కోడెల కుటుంబాన్ని టీడీపీ అధిష్టానం, అధినేత వెలివేయ‌డం, దీంతో కోడెల పార్టీ మారాల‌నే ఆలోచ‌న చేయ‌డం, అయినా వీలు కాక‌పోవ‌డంతో కుటుంబ సభ్యుల వ్య‌వ‌హార‌శైలీ న‌చ్చ‌క కోడెల హైద‌రాబాద్‌లో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం జ‌రిగాయి. అయితే కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ఏపీలో సంచ‌ల‌నం క‌లిగించింది. కోడెల మృతితో శివరాం విదేశాల నుంచి ఏపీకి తిరిగొచ్చారు.

కోడెల మ‌ర‌ణంతో టీడీపీ శ్రేణులు ఏపీ ప్ర‌భుత్వం వేధింపుల‌తోనే కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని రాజ‌కీయ రంగు పులిమారు. దీంతో ప్ర‌భుత్వంపై వ‌స్తున్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో ఈ కేసుల‌ను ఏపీ పోలీసులు ప‌ట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా శివరాం పోలీసుల ఎదుట లొంగిపోకుండా ఆయ‌న నేరుగా హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే ఐదు కేసుల విషయమై తనకు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా కోడెల శివరాం హైకోర్టును మంగ‌ళ‌వారం ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన హైకోర్టు.. శివరాంను కింది కోర్టులో లొంగిపోవాల్సింగా సూచించింది. ఈ క్రమంలో కోడెల శివరాం ఈరోజు నరసరావుపేట ఫస్ట్‌ మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో లొంగిపోయారు.