Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ ఇంట్లో ఆరుగురికి కరోనా!

By:  Tupaki Desk   |   26 April 2020 11:36 AM GMT
వైసీపీ ఎంపీ ఇంట్లో ఆరుగురికి కరోనా!
X
ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా వైరస్ ప్రమాదకర రీతిలో వ్యాపిస్తోందని రోజు వారీగా బయటపడుతున్న కేసుల సంఖ్య చూస్తే అర్థమవుతోంది. నెల కిందట మిగతా రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతుంటే.. ఏపీ కేవలం పది కేసులతో ఉంది. కానీ నెల వ్యవధిలో వెయ్యికి పైగా కేసులు బయటపడ్డాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో ఏకంగా 81 కేసులు బయటపడటం ఆందోళన కలిగించే విషయం. మొన్నటిదాకా జీరో కేసులంటూ సంబరపడ్డ శ్రీకాకుళంలో కూడా తాజాగా 3 కేసులు బయటపడ్డాయి. 260 మంది క్వారంటైన్‌కు వెళ్లారు. ఇందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం - ఆయన బలగమే కారణమని.. ఆయన జిల్లాకు వెళ్లి ఓ మీటింగ్ పెట్టడం వల్లే కరోనా వ్యాప్తి చెందిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు ప్రచార హడావుడి వల్లే కరోనా వ్యాప్తి పెరుగుతోందన్న ఆరోపణలున్నాయి.

ఇప్పుడేమో ఓ వైసీపీ ఎంపీ ఇంట్లోనే ఏకంగా ఆరుగురు కరోనా బారిన పడటం విస్తుగొలుపుతోంది. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకిన విషయం బయటపడింది. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీనే మీడియాకు వెల్లడించారు. కరోనా సోకిన వారిలో ఎంపీ ఇద్దరు సోదరులు, వారి సతీమణులతో పాటు వీరి సంతానంలో ఒక కుర్రాడికి.. 83 ఏళ్ల సంజీవ్ తండ్రికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఎంపీ తండ్రి పరిస్థితి సీరియస్‌ గా ఉండటంతో హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. వయసు మీద పడ్డ వారు - ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందన్న సంగతి తెలిసిందే. మరి ఎంపీ తండ్రి పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ఏపీలో కరోనా చాలా ప్రమాదకరంగా విస్తరిస్తున్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. అక్కడ ఏకంగా 279 కేసులు నమోదయ్యాయి. అందులో 31 మంది డిశ్చార్జి కాగా.. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.