Begin typing your search above and press return to search.

ఆంధ్రాలో ఆర్నెల్లు జైలు..తెలంగాణ సంగతేంటి సారూ?

By:  Tupaki Desk   |   24 March 2020 5:59 AM GMT
ఆంధ్రాలో ఆర్నెల్లు జైలు..తెలంగాణ సంగతేంటి సారూ?
X
ప్రధాని మోడీ ఆగ్రహం.. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల కరకు మాటలు చెప్పేది ఒక్కటే.. కరోనా లాంటి ప్రమాదకర వైరస్ వేగంగా విస్తరిస్తున్న వేళ.. ప్రభుత్వ ఆదేశాల్ని పక్కన పెట్టి పలువురు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. బాధ్యత లేకుండా బయటకు వచ్చేస్తున్న తీరుతో వైరస్ ముప్పు అంతకంతకూ పెరిగే వీలుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది.

వైరస్ ముప్పు నుంచి తప్పించేందుకు ఎవరికి వారు ఇళ్లల్లోనే ఉండాలంటూ లాక్ డౌన్ ప్రకటించిన వేళ.. అందుకు భిన్నంగా రోడ్ల మీదకు బాధ్యత లేకుండా వస్తున్న వారి విషయంలో చట్టం కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనల్ని రూపొందించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల్ని పాటించని వారి విషయంలో చర్యలు తీసుకోనున్నారు. లాక్ డౌన్ ను బ్రేక్ చేసే వారికి ఆర్నెల్లు జైలు శిక్ష తప్పదని.. వెయ్యి రూపాయిల జరిమానా విధించే అధికారాన్ని సంబంధిత అధికారులకు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలుజారీ చేసింది.

లాక్ డౌన్ మినహాయింపు ఉన్న సేవలు తప్పించి మిగిలినవన్నీ ఆపేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే నెలరోజులు జైలు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైరస్ ను వ్యాప్తికి పాల్పడితే ఆర్నెల్లు జైలు.. మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగేలా వ్యవహరిస్తే అలాంటివారికి రెండేళ్ల వరకూ జైలు విధించాలని నిర్ణయించారు. ఏపీలో ఇంత కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. తెలంగాణలో కూడా ఈ తరహా కఠిన ఆదేశాల్ని జారీ చేయటంలో కేసీఆర్ సర్కారు ఇంకా ఎందుకు రియాక్ట్ కావటం లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.