Begin typing your search above and press return to search.

అంచనాలకు భిన్నంగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు

By:  Tupaki Desk   |   16 April 2020 3:30 AM GMT
అంచనాలకు భిన్నంగా  తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు
X
అంచనాలకు భిన్నంగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. ఆయన తీరుకు తగ్గట్లే.. తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల లెక్కలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. సాధారణంగా ఒక క్రమ పద్దతిలో కరోనా కేసుల నమోదు కనిపిస్తుంది. నెమ్మదిగా మొదలయ్యే కరోనా పాజిటివ్ కేసులు.. ఒక స్థాయి వచ్చిన తర్వాత మాత్రం దాని వేగానికి ఆయా ప్రభుత్వాలు విలవిలలాడి పోవాల్సిందే.

ఎక్కడిదాకానో ఎందుకు? మన దేశంలోని పరిస్థితే చూస్తే.. కరోనా పాజిటివ్ కేసులు ఒక క్రమపద్దతిలో పెరగటమే కాదు.. తాజాగా దూకుడు ఎక్కువైన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలోని పరిణామాలు ఉండటం గమనార్హం.

మంగళవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కేసులు ఏకంగా యాభై రెండు. ఇంత భారీగా పాజిటివ్ కేసులు నమోదైన పక్కరోజున ఎన్ని కేసులు కొత్తగా వచ్చే అవకాశం ఉందని ఎవరిని అడిగినా? నలభై వరకూ తగ్గే అవకాశం లేదని చెబుతారు. కానీ.. తాజాగా పరిస్థితి చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా 52 కేసులు నమోదు కాగా.. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నలభై కేసులు కొత్తవిగా తేల్చారు.

ఇలాంటి వేళ.. ఆందోళన పెరగటం ఖాయం. అందుకు భిన్నంగా బుధవారం కేవలం ఆరు కేసులు మాత్రమే పాజిటివ్ లుగా తేలినట్లు చెబుతున్నారు. నాలుగైదు రోజుల క్రితం కూడా ఇలాంటి పరిస్థితే. రోజకు పద్దెనిమిది.. పన్నెండు కేసులు నమోదు కావటం.. కొత్త కేసులు వెలుగు చూస్తున్నవి తగ్గిపోయిన భావన వ్యక్తమైంది. హమ్మయ్య అని ఫీల్ అయ్యే లోపు.. సోమ.. మంగళవారాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదు అయ్యాయి. ఇంతలోనే ఇంతలా పాజిటివ్ కేసులు పెరిగి పోవటమా? అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదు కావటం ఒక పట్టాన మింగుడుపడటం లేదని చెప్పక తప్పదు.

తాజాగా లెక్కలోకి వచ్చిన కొత్త కేసులతో తెలంగాణలో 650 కేసులు నమోదైనట్లుగా తేలింది. ఇప్పటివరకూ 118 మంది డిశ్చార్జ్ కాగా గురువారం మరో 128 మంది ఆసుపత్రుల నుంచి ఇళ్లకు వెళ్లనున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య పద్దెనిమిదికి చేరింది.

గురువారం పెద్ద ఎత్తున డిశ్చార్జిలు ఉండటం తో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. సమస్యల్లా ఒక్కటే. తెలంగాణ ప్రభుత్వం వెల్లడిస్తున్న కరోనా పాజిటివ్ గణాంకాల తీరు ఎవరికి మింగుడుపడటం లేదు. క్రమపద్దతిలో తగ్గటం.. ఒక్కసారిగా ఊహకు అందని రీతిలో భారీ సంఖ్యలో నమోదు కావటం.. ఆ వెంటనే టప్ మని పడిపోవటం చూసినప్పుడు తెలంగాణలో కరోనా ట్రెండ్ ఎలా ఉందన్న విషయం ఏ మాత్రం మింగుడుపడని రీతిలో ఉందన్న మాట వినిపిస్తోంది.