Begin typing your search above and press return to search.

రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో ఆరుగురు 'శంక‌ర్ దాదాలు'?

By:  Tupaki Desk   |   2 April 2018 4:08 AM GMT
రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో ఆరుగురు శంక‌ర్ దాదాలు?
X
షాకింగ్ ఘ‌ట‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది. దేశ ప్ర‌ధ‌మ పౌరుడు.. రాజ్యాంగ‌బ‌ద్ధంగా చూస్తే.. దేశంలో అత్యున్న‌త అధికారంలో ఉండే స్థానంగా చెప్పాలి. అలాంటి వ్య‌క్తి నివ‌సించే చోటు ఎంత ప‌క్కాగా ఉండాలి. ప్ర‌ధ‌మ పౌరుడికి సేవ‌లు చేయ‌టానికి.. ఆయ‌న అవ‌స‌రాల కోసం నియ‌మించే వ్య‌క్తుల బ్యాక్ గ్రౌండ్ ఎంత క్షుణ్ణంగా ప‌రిశీలించాలో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

అత్యాధునిక సాంకేతిక‌తతో భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించే రాష్ట్రప‌తి భ‌వ‌న్లో ఆరుగురు శంక‌ర్ దాదాలు తిష్ట వేసిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. త‌మ‌కు అర్హ‌త లేకున్నా.. న‌కిలీలు అడ్డు పెట్టుకొని రాష్ట్రప‌తి భ‌వ‌న్లో ఉద్యోగాన్ని సంపాదించిన వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నంగా మారింది.

రాష్ట్రప‌తి భ‌వ‌న్ లోకి అడుగు పెట్టాలంటేనే లెక్క‌లేన‌న్ని త‌నిఖీల‌తో పాటు.. అనుక్ష‌ణం డేగ‌క‌న్నుతో ప‌రిస‌రాల్ని ప‌ర్య‌వేక్షిస్తుంటారు. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య ఉండే రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో చోటు చేసుకున్న నియామ‌క‌పు నిర్ల‌క్ష్యం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. నకిలీ ధ్రువ‌ప‌త్రాల‌తో ఏకంగా ఏడాదిపాటు ఆరుగురు ప‌ని చేసిన వైనం చూస్తే.. నిఘా వ‌ర్గం నిద్ర పోతుందా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఇంత‌కీ ఏం జ‌రిగింది? ఈ మోసం ఎలా బ‌య‌ట‌ప‌డింద‌న్న విష‌యాల్లోకి వెళితే..

రాష్ట్రప‌తి భ‌వ‌న్లో విశాల‌మైన గార్డెన్ ఉంది. వీటిని సంర‌క్షించేందుకు పెద్ద ఎత్తున వ‌ర్క‌ర్లు ప‌ని చేస్తుంటారు. వీరి నియామ‌కం కోసం నిర్వ‌హించిన విధానంలో చేతివాటం కార‌ణంగా నకిలీలు ఏకంగా రాష్ట్రప‌తి భ‌వ‌న్లో తిష్ట‌వేసే అవ‌కాశం ల‌భించిన‌ట్లుగా చెబుతున్నారు. గార్డెనింగ్ విభాగంలో ప‌ని చేసేందుకు గ‌త ఏడాది ఆన్ లైన్ నియామ‌కాలకు నోటిఫికేష‌న్ జారీ చేశారు. రాజ‌స్థాన్ కు చెందిన అమిత్ కుమార్.. దీప‌క్ క‌ష్వ‌హ‌.. దిలీప్ కుమార్.. పుష్పేంద్ర కుమార్.. జితేంద్ర‌.. సురేంద్రలు రాష్ట్రప‌తి భ‌వ‌న్లో ప‌ని చేసేందుకు నియ‌మించారు.

త‌మ అపాయింట్ మెంట్ కోసం వీరు ఇచ్చిన స‌ర్టిఫికేట్లు అన్ని డూప్లికేట్ గా తేలాయి. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అపాయింట్ అయిన వీరి విద్యార్హ‌త విష‌యంపై రీ చెక్ చేస్తున్న సంద‌ర్భంగా ఈ ఆరుగురి న‌కిలీల భాగోతం బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌క్ష‌ణ‌మే వీరిని విధుల నుంచి తీసేసి.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నా.. రాష్ట్రప‌తి భ‌వ‌న్లో ప‌ని చేయ‌టానికి ఆన్ లైన్ తో టోక‌రా ఇచ్చేసిన వైనం చూస్తే.. వ్య‌వ‌స్థ‌లో లోపాలు ఎంత‌లా ఉన్నాయ‌న్న విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు