Begin typing your search above and press return to search.

తమిళ ఎన్నికల బరిలో ఆరుగురు హిజ్రాలు

By:  Tupaki Desk   |   8 April 2016 4:57 AM GMT
తమిళ ఎన్నికల బరిలో ఆరుగురు హిజ్రాలు
X
అందరిలో ఆసక్తి రేపుతున్న తమిళనాడు ఎన్నికల్లో ఒక విశేషం పలువురిని ఆకర్షిస్తోంది. ఎన్నికల బరిలో పురుషులు ఎక్కువగా పోటీ చేయటం మామూలే. ఈ రంగంలో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత తక్కువే. అలాంటి హిజ్రాలకు అవకాశం లభించే అవకాశమే ఉండదు. నిజానికి.. అత్యున్నత స్థానాల్లో మహిళలు ఉన్నప్పటికీ.. రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం పెద్దగా ఉండవు. అయితే.. దీనికి భిన్నంగా ఈసారి తమిళనాడు ఎన్నికల్లో కొన్నిమార్పులు చోటు చేసుకోవటం కనిపిస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే ఈసారి మహిళలకు ఎక్కువ సీట్లను ఇవ్వటం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో హిజ్రాలు గతం కంటే ఎక్కువగా ఎన్నికల బరిలోకి దిగటం కనిపిస్తుంది. వీరు సొంతంగా కంటే.. రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తుండటం గమనార్హం.

తమిళనాడు ఎన్నికల బరిలో పోటీకి దిగుతున్న హిజ్రాలు ఆరుగురికి చేరారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బరిలోకి దిగుతున్న ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి ఒక హిజ్రా బరిలోకి దిగటం తెలిసిందే. తాజాగా మరికొన్ని పార్టీలు కూడా హిజ్రాల్ని అభ్యర్థులుగా ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుగురు హిజ్రాలు బరిలోకి దిగుతుండగా.. దేశీ అనే హిజ్రా నామ్ తమిళర్ కట్చి పార్టీ తరఫున అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మీద పోటీ చేస్తున్నారు.

డీఎండీకే తరఫున సేలంలో రాధిక అనే హిజ్రా బరిలోకి దిగుతుంటే.. శరత్ కుమార్ అధ్యక్షుడుగా ఉన్న సమత్తువ మక్కల్ కట్చి నుంచి గతంలో ఎన్నికల బరిలో దిగిన భారతికన్నమ్మ ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే.. పార్టీ తరఫున.. లేదంటే స్వతంత్ర్య అభ్యర్థిగానా? అన్నది తేల్చుకోలేదు. ఇక.. హిందు మక్కల్ కట్చి తరఫున మదురై సెంట్రల్ నుంచి అనసూయ అనే హిజ్రా పోటీకి దిగుతున్నారు. మొత్తానికి తమిళనాడు ఎన్నికల్లో హిజ్రా జోరు ఎక్కువగా ఉందనే చెప్పాలి.