Begin typing your search above and press return to search.

నోట్ల రద్దు జరిగి ఆరేళ్లయినా.. ఫేక్ కరెన్సీ ఎందుకుంది..?

By:  Tupaki Desk   |   2 Jun 2022 8:34 AM GMT
నోట్ల రద్దు జరిగి ఆరేళ్లయినా.. ఫేక్ కరెన్సీ ఎందుకుంది..?
X
పెద్ద నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోతాయన్న ప్రధాని మోదీ మాటలు మాటలకే పరిమితమయ్యాయా..? పెద్ద నోట్ల రద్దు.. నకిలీ కరెన్సీ నోట్ల ఆట కడుతుందని.. నల్లధన కుబేరుల పని పడుతుందన్న వ్యాఖ్యలు ఉత్తుత్తవేనా..? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. గతేడాది పోలిస్తే ప్రస్తుత మార్కెట్‌లో నకిలీ కరెన్సీ పెరిగిందని ఆర్బీఐ నివేదిక చెబుతోంది. పెద్ద నోట్లు రద్దు చేసినా ఫేక్ నోట్లు ఎందుకు పెరుగుతున్నాయి..? మోదీ నిర్ణయం సరైనదైనా.. ఆచరణ సరిగ్గా లేదా..? దీనిపై మోదీ ప్రభుత్వం ఏం చెబుతోంది..? నకిలీ నోట్ల కట్టడికి పరిష్కార మార్గాలేమిటి..?

నకిలీ నోట్ల బెడదను తొలగించాలని.. నల్ల ధనాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంలో ప్రధాన మంత్రి మోదీ 2016లో పెద్ద నోట్లను రద్దు చేశారు. నోట్ల రద్దు జరిగి దాదాపు ఆరేళ్లు గడుస్తున్నా ఈ రెండిట్లో ఏ ఒక్క విషయం లోనూ మోదీ సర్కార్ సఫలీకృతం కాలేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఆర్బీఐ తాజా నివేదిక పరిశీలిస్తే ఇదే నిజమని నిరూపితమవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం మార్కెట్‌లో ప్రస్తుతం నకిలీ కరెన్సీ నోట్ల దందా నడుస్తోందని స్పష్టమవుతోంది.

గతేడాదితో పోలిస్తే రూ.500 నోట్లలో నకిలీ నోట్లు 101.9 శాతం, రూ.2వేల నోట్లలో రూ.54.13 శాతం నకిలీ నోట్ల పెరుగుదల కనిపించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక(2021-22) వెల్లడించింది. బ్యాంకింగ్ రంగం గుర్తంచిన మొత్తం నకిలీ నోట్లలో 6.9 శాతం ఆర్బీఐ వద్ద బయటపడితే.. 93.1 శాతం ఇతర బ్యాంకుల వద్ద గుర్తించినట్లు తెలిపింది. అయితే పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది వద్ద పట్టుబడిన నకిలీ నోట్ల ప్రస్తావన ఈ నివేదికలో ప్రస్తావించలేదు. 2020లో రూ.92 కోట్ల విలువైన 8,34,947 నోట్లను.. 2019లో రూ.25 కోట్ల విలువైన 2,87,404 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది.

'నకిలీ నోట్ల వ్యాపారం చాలా లాభసాటిగా ఉంటుంది. ఒక నోటును ముద్రించేందుకు ఆర్బీఐకి రూ. 2.5 నుంచి రూ.3 ఖర్చయితే.. నకిలీ నోట్లు తయారు చేసే వారికి రూ.10 ఖర్చు అయినా.. రూ.490 లాభం వస్తుంది. ఆధునిక టెక్నాలజీ కూడా ఫేక్ నోట్లు విరివిగా ఓ పెరగడానికి కారణం. నకిలీ నోట్లకు కళ్లెం వేయడం చాలా కష్టం. పెద్ద నోట్ల రద్దుతో నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయలేం. నకిలీ నోట్ల ముద్రణలో దేశ వ్యతిరేక శక్తులకు సంబంధం ఉంటుంది. అందుకే పెద్ద నోట్ల రద్దుతో దీన్ని అడ్డుకోలేం. నకిలీ నోట్ల కట్టడికి పటిష్ఠమైన ప్లానింగ్ కావాలి.' అని దిల్లీలోని జేఎన్‌యూ ప్రొఫెసర్‌ అరుణ్‌ కుమార్ అన్నారు.

మార్కెట్‌లో ఉన్న వాటితో పోలిస్తే, బ్యాంకింగ్ లేదా భద్రతా సంస్థల సిబ్బంది పట్టుకుంటున్న నకిలీ నోట్లు చాలా తక్కువని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అన్నారు. కేవలం మూడు నుంచి నాలుగు శాతం నోట్లు మాత్రమే అధికారుల చేతి వరకు వస్తాయని తెలిపారు. నివేదికలు.. అధికారిక గణాంకాలతో నకిలీ నోట్ల సంఖ్యపై అవగాహనకు రాకూడదని చెప్పారు. ఈ సమస్య చాలా పెద్దదని.. కొందరికి తమ వద్ద ఉన్నవి నకిలీ నోట్లో అసలైన నోట్లో కూడా తెలీదని అన్నారు. నకిలీ నోట్ల సంఖ్య పెరిగినప్పుడు.. కరెన్సీ విశ్వసనీయత కూడా దెబ్బతింటుందని పేర్కొన్నారు.

'ఫేక్ నోట్ల కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల నకిలీ కరెన్సీ ముద్రించే వాళ్లు ఎప్పటికప్పుడు వాళ్ల టెక్నాలజీ అప్‌డేట్ చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల వాళ్లు ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నారు. ఇలా కొంత వరకు నకిలీ నోట్ల కట్టడి జరుగుతోంది. ముఖ్యంగా వాటర్ మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, సీక్రెట్ ఇమేజ్, మైక్రో లెటిరింగ్, సీల్, ఐడెంటిఫికేషన్ మార్క్ వంటి ఫీచర్లను ఆర్బీఐ ఎప్పటికప్పుడు మారుస్తోంది. మరోవైపు నకిలీ నోట్లు గుర్తించేలా.. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతోంది. ఎన్ని సెక్యూరిటీ ఫీచర్లు తీసుకొచ్చినా.. నకిలీ నోట్లు ముద్రించే వాళ్లు వాటిని కూడా కాపీ కొట్టేస్తున్నారు. అందుకే కాపీ కొట్టడానికి వీల్లేని హ్యాక్స్‌ను ఆర్బీఐ ప్రవేశపెట్టాలి' అని అరుణ్ కుమార్' అన్నారు.

నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర హోం శాఖ ఎఫ్ఐసీఎన్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా టెర్రర్ ఫండింగ్ అండ్ ఫేక్ కరెన్సీ సెల్ (టీఎఫ్ఎఫ్‌సీ) విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఫేక్ నోట్లపై దర్యాప్తు బాధ్యతలను టీఎఫ్ఎఫ్‌సీ చూసుకుంటుంది. నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు బంగ్లాదేశ్‌తోనూ భారత్ ఒక ఒప్పందం కుదర్చుకుంది. ఫేక్ కరెన్సీ నోట్లను గుర్తించేందుకు, ఈ కేసులకు సంబంధించి దర్యాప్తు విషయంలో బంగ్లాందేశ్, నేపాల్‌ దేశాలు పోలీస్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి.