Begin typing your search above and press return to search.

ఈ అధికార‌పార్టీ ఎమ్మెల్యేని ఏం చేయాలి?

By:  Tupaki Desk   |   9 Aug 2016 7:44 AM GMT
ఈ అధికార‌పార్టీ ఎమ్మెల్యేని ఏం చేయాలి?
X
ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో స్వేచ్ఛ ఎక్కువే. దాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలే త‌ప్పించి స్వార్థానికి వినియోగించకూడ‌దు. కొద్దికాలంగా దేశంలోని ప‌లువురు.. త‌మ స్వార్థం కోసం చేస్తున్న వ్యాఖ్య‌లు.. అనుస‌రిస్తున్న విధానాలు వివాదాల‌కు కేంద్రంగా మార‌ట‌మే కాదు.. అన‌వ‌స‌ర‌మైన ఆందోళ‌న‌ల‌కు.. ఆశాంతికి కార‌ణ‌మ‌వుతున్నాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచ‌న‌ల‌తో వ్య‌వ‌హ‌రించే ఒక ఉగ్ర‌వాదిని దైవ‌భ‌క్తుడిగా కీర్తిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేని ఏం చేయాలి? అలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించాల‌న్న భావ‌న‌.. స‌దరు ఎమ్మెల్యే చేసి తాజా వ్యాఖ్య‌లు వింటే క‌ల‌గ‌క మాన‌దు. భ‌ద్ర‌తా ద‌ళాలు నిర్వ‌హించిన ఎన్ కౌంట‌ర్ లో మ‌ర‌ణించిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర‌వాది బుర్హాన్ వని కార‌ణంగా క‌శ్మీర్ లోయ‌లో ఎంత‌టి ఆశాంతి నెల‌కొందో తెలిసిందే.

దీనికి అజ్యం పోస్తూ పాకిస్థాన్ ఇప్ప‌టికే వ్య‌ర్థ ప్రేలాప‌న‌ల్ని పేలింది. పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ వ‌నిని అమ‌ర‌వీరుడంటూ కీర్తించ‌టం భార‌త్ తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దాయాది దుష్ట ఆలోచ‌న‌లు తెలిసినోళ్లు పాక్ అధ్య‌క్షుడి వ్యాఖ్య‌ల వెనుకున్న అస‌లు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటారు.

కానీ.. జ‌మ్ముక‌శ్మీర్ అధికార‌ప‌క్ష‌మైన పీడీపీకి చెందిన ఎమ్మెల్యే తాజాగా చేసిన వ్యాఖ్య‌లుసంచ‌ల‌నంగా మారాయి. వ‌నిని గొప్ప దైవ‌భ‌క్తుడిగా కీర్తించ‌ట‌మే కాదు.. వ‌ని గురించి త‌న‌కు అంతా తెలుస‌ని.. క‌శ్మీర్ లో కొన‌సాగుతున్న వేధింపుల‌కు ఫ‌లితంగా పుట్టిన ఉద్య‌మ శ‌క్తిగా అత‌డ్ని అభివ‌ర్ణించ‌టం గ‌మ‌నార్హం. పీడీపీ ఎమ్మెల్యే ముస్తాక్ అహ్మ‌ద్ షా.. వ‌ని సొంతూరైన త్రాల్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఈ అధికార‌పార్టీ ఎమ్మెల్యే.. వ‌నిని కీర్తించ‌ట‌మే కాదు.. పాల‌కులు క‌శ్మీర్ స‌మ‌స్య‌ను గాలికి వ‌దిలేసిన స‌మ‌యంలో వ‌ని త‌న మ‌ర‌ణంతో ఉద్య‌మానికి జీవం పోశాడ‌ని.. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి పోరాడుతున్న వేర్పాటువాదుల‌కు త‌న మ‌ర‌ణంతో కొత్త మార్గం చూపించాడంటూ దారుణ వ్యాఖ్య‌ల‌కు తెగ‌బ‌డ్డారు. వ‌ని ఎన్ కౌంట‌ర్ తో గ‌డిచిన 31 రోజులుగా క‌శ్మీర్ అట్టుడికిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు స‌ర్దుమ‌ణుగుతున్న స‌మ‌యంలో అధికార‌పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

వ‌ని ఎన్ కౌంట‌ర్‌త‌ర్వాత చెల‌రేగిన ఆందోళ‌న‌ల్లో ఇప్ప‌టివ‌ర‌కూ 60 మంది మ‌ర‌ణించ‌గా.. దాదాపు 3వేల మందికి పైనే గాయాల‌య్యాయి. గ‌డిచిన నెల రోజులుగా క‌శ్మీర్ లోని ప‌ది జిల్లాల్లో క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. జ‌న‌జీవ‌నం స్తంభించిపోయిన నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ ఈ అంశంపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్న వేళ‌.. అధికార‌పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొనేందుకు జ‌మ్ముక‌శ్మీర్ ముఖ్య‌మంత్రి మొహ‌బూబా ముఫ్తీ కేంద్రంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న వేళ‌.. ఎమ్మెల్యే షా చేసిన వ్యాఖ్య‌లు కొత్త చికాకులు తెచ్చి పెట్టే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే అత‌డిపై వేటు వేసే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. దేశ స‌మ‌గ్ర‌త‌కు.. శాంతికి భంగం వాటిల్లే వ్య‌వ‌హ‌రించే వారి విష‌యంలో చ‌ట్టం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఆ విష‌యాన్ని స‌ద‌రు ఎమ్మెల్యేపై చ‌ర్య‌ల ద్వారా స్ప‌ష్టం చేయాల్సిన అవ‌స‌రం ఉంది.