Begin typing your search above and press return to search.

శోభాయాత్ర‌లో ఎప్పుడూ క‌నిపించని కొత్త దృశ్యం

By:  Tupaki Desk   |   5 Sep 2017 10:34 AM GMT
శోభాయాత్ర‌లో ఎప్పుడూ క‌నిపించని కొత్త దృశ్యం
X
ఈసారి గ‌ణేశ్ నిమ‌జ్జ‌నంలో స‌రికొత్త దృశ్యం ఆవిష్కృత‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ నిమిజ్జ‌నంలోనూ చూడ‌ని కొత్త అంశం క‌నిపించింది. ఇటీవ‌ల కాలంలో డోక్లాం వివాదంలో భార‌త్ - చైనా మ‌ధ్య న‌డిచిన ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో చైనా వ్య‌తిరేక‌త నిమ‌జ్జ‌నంలో స్ప‌ష్టంగా క‌నిపించింది.

హైద‌రాబాద్ లో భారీ వేడుక‌గా నిర్వ‌హిస్తున్న శోభాయాత్ర సంద‌ర్భంగా ప‌లువురు చైనా వ్య‌తిరేక నినాదాలు ఇవ్వ‌టం ఒక ఎత్తు అయితే.. భార‌త ఆర్మీ జిందాబాద్‌.. భార‌త్ మాతాకీ జై అన్న నినాదాలు జోరుగా వినిపించాయి. శోభా యాత్ర‌లో పాల్గొన్న వారు ప‌లువురు చైనా వ్య‌తిరేక ప్ల‌కార్డులు ప‌ట్టుకోవ‌టం క‌నిపించింది.

నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా ప్ర‌సంగించే ప‌లువురు చైనా వ‌స్తువ‌ల వినియోగం త‌గ్గిద్దామ‌ని.. చైనా వ‌స్తువుల‌పై ఎవ‌రికి వారు నిషేధించాల‌న్న పిలుపు ఇవ్వ‌టం క‌నిపించింది. చైనా వ్య‌తిరేక ధోర‌ణి ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించింది. డోక్లాం స‌రిహ‌ద్దు వివాదంలో చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. అందుకు బ‌దులుగా భార‌త్ సైతం ధీటుగా రియాక్ట్ కావ‌టం.. చైనా ప‌ప్పులు ఉడ‌క‌కుండా చేయ‌టంలో మోడీ స‌ర్కారు స‌క్సెస్ సాధించింద‌ని చెప్పాలి. భూటాన్ స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన డోక్లాంను చైనా క‌బ్జా చేసి రోడ్డు వేయాల‌ని ప్ర‌య‌త్నించ‌టం.. దాన్ని అడ్డుకునేందుకు భార‌త్ సైన్యం భూటాన్‌కు అండ‌గా నిలుస్తూ అడ్డుకోవ‌టం తెలిసిందే. దీంతో.. రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు అంత‌కంత‌కూ పెరిగాయి. చివ‌ర‌కు.. రెండు దేశాల‌కు చెందిన సైనికులు ఒకే స‌మ‌యంలో వెన‌క్కి త‌గ్గాలంటూ భార‌త్ చేసిన ప్ర‌తిపాద‌న‌ను ఎట్ట‌కేల‌కు చైనా ఓకే చేయ‌టంతో డోక్లాం వివాదం ఒక కొలిక్కి వ‌చ్చింది.

దాదాపు రెండు నెల‌ల పాటు సాగిన ఈ ఇష్యూ నేప‌థ్యంలో చైనా మీద స‌గ‌టు భార‌తీయుడు మండిప‌డుతున్నాడు. చైనా వ‌స్తువుల్ని భారీగా వినియోగిస్తున్న మ‌న దేశంలో ఆ దేశ ఉత్ప‌త్తుల్ని వినియోగించ‌కుండా చేస్తే చైనా తిక్క కుదురుతుంద‌న్న భావ‌న పెద్ద ఎత్తున క‌నిపిస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌నంగా శోభా యాత్ర‌లో చైనా వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపించ‌టం విశేషంగా చెప్పాలి.