Begin typing your search above and press return to search.

భూమా ఫ్యామిలీ...ధీమా ఏదీ...?

By:  Tupaki Desk   |   14 Dec 2021 3:30 AM GMT
భూమా ఫ్యామిలీ...ధీమా ఏదీ...?
X
రాజకీయాల్లో నిన్న ఉన్నట్లుగా నేడు ఉండదు. ఇది ఎన్నో సార్లు రుజువు అయింది. కర్నూల్ జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్నప్పటికీ భూమా నాగిరెడ్డి మంత్రి కాలేకపోయారు. చివరికి మానసిక అశాంతితోనే ఆయన కాలం చేశారు. భూమా నాగిరెడ్డి అంటే ఆళ్ళగడ్డకు అతి పెద్ద దిక్కు. దాన్ని తన అడ్డాగా చేసుకుని రాజకీయాల్లో సుదీర్ఘకాలం చక్రం తిప్పారు.

అంతే కాదు నంద్యాలను సైతం ఆయన కనుసైగతో తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. ఆయన ఒకపుడు నంద్యాల ఎంపీ కావడంతో ఈ రెండు సీట్లలో భూమా ఫ్యామిలీకి ఎదురులేని సీన్ ఉండేది. దాంతో భూమా సతీమణి శోభా నాగిరెడ్డి కూడా రాజకీయాల్లోకి వచ్చి తన సత్తా చాటారు. ఇలా భార్యాభర్తలు ఇద్దరూ సరైన పార్టీ చూసుకుని అక్కడ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేవారు.

అయితే ఇంతలా జనాదరణ, అధినాయకత్వం వద్ద పలుకుబడి ఉన్నా కూడా ఈ ఇద్దరికీ అమాత్య కిరీటం మాత్రం దక్కలేదు. ఇక శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి వైసీపీలో చేరిన తరువాత ఎన్నికలకు ముందే శోభ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ తరువాత ఉప ఎనికల్లో అఖిల ప్రియ తల్లి సీటుని దక్కించుకున్నారు. తండ్రి నాగిరెడ్డి తో కలసి ఆమె టీడీపీలో చేరిపోయారు.

అప్పట్లో నాగిరెడ్డికి మంత్రి పదవిని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అది జరగకపోవడంతో ఆయన గుండె పోటుతో మృతి చెందారని చెబుతారు. దాంతో సానుభూతి కోసం అఖిలప్రియను మంత్రిగా చేశారు. అలా ఎమ్మెల్యే సీటు, మంత్రి పదవి జాక్ పాట్ గా దక్కిన అఖిల ప్రియకు గత ప్రభుత్వ ఏలుబడిలో ఎదురులేకుండా పోయింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఆమెకు చుక్కలు కనిపించాయి. వైసీపీ వేవ్ లో మొత్తానికి మొత్తం కొట్టుకుపోయింది. ఆళ్ళగడ్డలో వైసీపీ చేతిలో ఆమె ఓడిపోయారు.

ఇక ఆ తరువాత టీడీపీ ఆమెను దూరం పెట్టడం మొదలెట్టింది. అఖిలప్రియ కేరాఫ్ నాగిరెడ్డి అన్నది తప్ప సొంతంగా ఎక్కడా పూర్తి పట్టు ఆమెకు లేదని గ్రహించే అధినాయకత్వం సైడ్ చేస్తూ వచ్చిందని చెబుతారు. ఇక ఆమె ఒక భూ వివాదం, కిడ్నాప్ కేసుల్లో అరెస్ట్ కావడం, ఆమె భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగత్ విఖ్యాతరెడ్డిల మీద కూడా కేసులు ఉండడంతో పాటు అవన్నీ వివాదాలు రచ్చ కావడంతో టీడీపీ పూర్తిగా భూమా ఫ్యామిలీని పక్కన పెట్టేసింది అని చెబుతారు.

ఈ మొత్తం వ్యవహారంలో చూసుకుంటే భూమాకు వరసకు అన్న అయ్యే భూమా కిశోర్ రెడ్డి ఇపుడు ఆల్లగడ్డలో జెండా పాతేస్తున్నాడు అంటున్నారు. ఆయన బీజేపీలో ఉంటూనే పట్టు బాగా పెంచుకుంటున్నాడు. ఎన్నికల వేళ ఆయన టీడీపీలోకి వస్తారని కూడా ప్రచారం సాగుతోంది. దాంతో ఆయనకు టికెట్ ఖాయమని కూడా చెబుతున్నారు.

ఆయనకు టికెట్ ఖాయమన్నది ఒక వైపు వినిపిస్తూంటే అఖిలప్రియకు దక్కదు అన్నది మరో విషయం. ఇక అఖిలప్రియ సోదరుడు జగత్ విక్యాత్ రెడ్డి ఈ పరిణామాలను చూసి తనకే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుంది అని ప్రచారం చేసుకోవడంతో అక్కా తమ్ముళ్ల మధ్య మరో వివాదం రేగుతోందిట. నిజానికి టీడీపీకి అయితే భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టేసే ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. మరి అక్కకు టికెట్ నో అంటే తానున్నాను అని తమ్ముడు జగత్ విఖ్యాత్ చెప్పుకోవడం వెనక కూడా కిశోర్ రెడ్డికి టికెట్ పోకూడదన్న స్ట్రాటజీ ఉందని చెబుతున్నారు.

ఎవరేమనుకున్నా కూడా చంద్రబాబు అనుకున్నది చేస్తారు, అన్నింటికీ మించి ఆళ్ళగడ్డలో బలంగా దూసుకుపోతున్నా కిశోర్ కుమార్ రెడ్డిని టీడీపీలోకి తెచ్చి అయినా టికెట్ ఇస్తారని చెబుతున్నారు. మొత్తానికి భూమా ఫ్యామిలీ అంటే తమకే కాదు మరో నలుగురికి టికెట్ ఇప్పించుకుని రాజకీయ దర్జా చేసే ఫ్యామిలీ. అలాంటి భూమా ఫ్యామిలీలో సొంత బిడ్డలకే ఇపుడు ఒక్క టికెట్ కూడా అదీ ఆళ్ళగడ్డలో దక్కడానికి ఏ మాత్రం ధీమా లేని పొలిటికల్ సీన్ ఉందని అంటున్నారు.

అవును మరి ఇది రాజకీయం. మంత్రిగా హవా చలాయించిన అఖిలప్రియకు ఇపుడు టికెట్ దక్కితే చాలు అన్న స్థితి వచ్చింది అంటే ఇందులో పార్టీల అవకాశ వాద రాజకీయాలు ఎలా ఉన్నా తనకంటూ సొంత అస్థిత్వాన్ని రాజకీయ బలాన్ని పెంచుకోవడంలో నాగిరెడ్డి ఫ్యామిలీ విఫలం అయిందనే అంటున్నారు.