Begin typing your search above and press return to search.

ఇంటర్ నెట్ కి బానిసై జీవితాలని నాశనం చేసుకుంటున్న పసిహృదయాలు

By:  Tupaki Desk   |   4 Nov 2019 8:05 AM GMT
ఇంటర్ నెట్ కి బానిసై జీవితాలని నాశనం చేసుకుంటున్న పసిహృదయాలు
X
కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టు ఎవరి పిల్లలు వారి ముద్దు. కానీ, ఒక్కొక్కసారి వారు చేసే కొన్ని చేష్టలవల్ల వారికే కాదు పక్కనున్న వారికీ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. పిల్లలను అల్లారుముద్దుగా అతిజాగ్రత్తగా పెంచుకుంటున్నామనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. కానీ ఆ భద్రత చట్రంలోకి అనూహ్యంగా అడుగుపెట్టి చిరుప్రాయాన్ని అల్లకల్లోలం చేస్తుంది అత్యాధునిక సాంకేతికత.

పనుల ఒత్తిడిలో సంపాదనే ద్యేయంగా క్షణం కూడా తీరిక లేకుండా గడిపే తల్లిదండ్రులు. ఒంటరితనంలో నేనున్నానంటూ అరచేతిలోనే అన్నీ చూపించే సాంకేతికత ఇలా అన్ని కలిపి ఏమి తెలియని వయస్సులోనే అన్ని తెలిసేలా చేస్తుంది ప్రస్తుత పరిజ్ఙానం. దీనితో ఆడపిల్లలైతే బాధితులవుతున్నారు.. మగపిల్లలైతే బందీలుగా మారుతున్నారు. పరిధి దాటుతున్న స్నేహాలు.. అరచేతిలో అశ్లీలం.. పసిప్రాయాన్ని కసిగా కాటేస్తున్నాయి. పుస్తకాల్లో పాఠాలతో జీవితానికి పునాదులు పడాల్సిన సమయంలో ప్రేమపాఠాలు, విశృంఖలత, విచ్చలవిడి సంస్కృతితో తప్పటడుగులు వేస్తున్నారు. తెలిసీ తెలియని వయసు, ఆకర్షణ, పరిచయాలతో ఆడపిల్లలు మోసపోతున్నారు. ఈ నెట్ కి బానిసై కొందరు తమ ప్రాణాలని పోగొట్టుకుంటుంటే ..మరికొందరు ప్రాణాలని తీయడానికి సైతం వెనుకాడంలేదు. చివరికి అవి వారి తల్లిదండ్రుల ప్రాణాలైనా కూడా.

దీనికి పెద్ద ఉదాహరణ ..ఈ మద్యే హయత్‌నగర్‌లో జరిగిన కీర్తి ఉదంతమే. పదహారేళ్లకే ఓ యువకుడి మోజులో పడి, శృగారంలో మునిగితేలి , గర్భం దాల్చడం, ఆ తర్వాత అన్నయ్య అని పిలిచే మరో యువకుడి సాయంతో గర్భవిచ్ఛిత్తి చేపించుకోవడం. ఆ సాకుతో బెదిరించి అతడు వలలో వేసుకోవడం. ఆ వ్యామోహం చివరకు తల్లినే కడతేర్చేవరకూ దారితీసింది. ఆ ఘటనే ఇప్పుడు ముగ్గురి జీవితాలని అంధకారంలోకి నెట్టేసింది.

ప్రస్తుత రోజుల్లో పదో తరగతిలోనే ప్రేమ, పగ మొదలవుతున్నాయి. అమ్మాయిల కోసం అబ్బాయిలు కత్తులతో రోడ్డు మీదనే నరుక్కునే స్థాయికి వచ్చేస్తున్నారు. మారుతున్న టెక్నాలజీ ప్రభావం, సామాజిక మాధ్యమాల ఉచ్చులోపడి, ఆకర్షణను ప్రేమగా నమ్ముతూ కొందరు వంచనకు గురవుతున్నారు. ప్రేమపేరిట ఇటీవల చిన్నారులను చిదిమి వేస్తున్న ఘటనలు నమోదవుతున్నాయి. ప్రేమ పేరుతొ వంచించి ..నమ్మించి అవసరం తీరాక ప్రాణాలని తీసిన ఘటనలు ఇప్పటికే ఎన్నో చూసాం. 18 ఏళ్లలోపు అమ్మాయి కనిపించకుండాపోయిన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ పరువు పోతుందన్న భయంతో ఫిర్యాదు చేయని కేసులు ఎన్నో ఉన్నాయి.

కొన్ని సందర్భాల్లో బాధితురాలి ఫిర్యాదు చేసినప్పటికీ మోసం చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ఆలస్యమవుతోంది. ఒక కేసులో అమ్మాయి మోసపోయి పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత నిందితున్ని పట్టుకునేందుకు ఏడు నెలలు పట్టింది. అప్పటికే ఆమె ఏడు నెలల గర్భవతి. చివరకు పాపకు జన్మనిచ్చి ప్రభుత్వ సంరక్షణ గృహానికి అప్పగించి వెళ్లిపోయింది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రేమ పేరిట ఏమీ తెలియని చిన్నారులు మోసాలకు గురవుతున్నారు. పాఠశాల పిల్లలను పాడుచేస్తున్న మరో సమస్య అశ్లీలం. స్మార్ట్‌ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడం, డేటా ధరలు తగ్గడంతో ఇప్పుడు అశ్లీలం అరచేతిలోకే వచ్చింది. ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతోంది. వీడియో ఆటల కోసం ఫోన్లు తీసుకుంటున్న పిల్లలు అవకాశం దొరికినప్పుడల్లా అశ్లీల వెబ్‌సైట్లు చూస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. ఉద్యోగం చేసి సంపాదించేదే వారికోసం అయితే.. వారి బాగోగులు చూసుకోలేనంత బిజీగా గడపడం అవసరమా ..ఒక్కసారి ఆలోచించండి ... ఒక్కసారి అనర్థం జరిగిన తరువాత ఎవరు ఎన్ని చెప్పినా ..ఏంమాట్లాడినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు.