Begin typing your search above and press return to search.

బండికి జై.. డీకే, జితేందర్ రెడ్డికి నై!

By:  Tupaki Desk   |   12 March 2020 4:50 AM GMT
బండికి జై.. డీకే, జితేందర్ రెడ్డికి నై!
X
తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది.. ఊహించుకుంది. కానీ చివరకు కోయిలా పాట గల్లంతైంది. పనిచేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్న వారికే పట్టం కట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎంతో ఎదురుచూసి ఖాయం అనుకున్న నేతలు ఇప్పుడు బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో అంతా షాక్ కు గురైన పరిస్థితి కనిపిస్తోంది.

రెండుమూడు రోజులుగా జరుగుతున్న ఊహాగానాల ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈసారి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకే దక్కుతుందని ప్రచారం సాగింది. అయితే డీకే అరుణ, లేదంటే జితెందర్ రెడ్డిలలో ఒకరికి ఖాయం అని అనుకున్నారు. వీరిద్దరూ కూడా బయట పార్టీల నుంచి వచ్చిన ఉద్దండులే. తమకు రాష్ట్ర పీఠం అని ఆశలు పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా తెరపైకి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేరు వచ్చింది. ఢిల్లీ బీజేపీ అధిష్టానం ప్రజల్లోకి బాగా దూకుడుగా చొచ్చుకెళ్లే బండి సంజయ్ ను ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిని చేసి ఆశ్చర్యపరించింది.

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగి దూకుడు రాజకీయాలకు పర్యాయపదంగా ఉన్న యువకుడు బండి సంజయ్ కు బీజేపీ పగ్గాలు అప్పజెప్పింది. ఈయన వరుసగా పార్లమెంట్, మండల, జడ్పీ, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చారు. టీఆర్ఎస్ పక్కలో బల్లెంలో దూకుడైన రాజకీయాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ మంత్రి గంగుల సహా గులాబీ నేతల అవినీతి పై హైకోర్టుకెక్కి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. బీజేపీలో ఏ నేత కూడా బండి సంజయ్ లా టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం లేదు.

జితేందర్ రెడ్డి అయితే ఏకంగా మోడీషాలకు బాగా దగ్గర. ఆయనకున్న పరిచయాలతో ఆయనే అధ్యక్షుడని అనుకున్నారు. మరో సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ సైతం అధ్యక్ష పదవి పై ఆశలు పెట్టుకున్నారు. ఈసారి అధ్యక్ష పదవి ని మహిళ అయిన ఫైర్ బ్రాండ్ డీకే అరుణకే ఇస్తారని ప్రచారం సాగింది. కేసీఆర్ పనితీరును తీవ్రంగా విమర్శించారు.

రాష్ట్ర పదవిని ఇద్దరు సీనియర్లు అయిన డీకే అరుణ, జితేందర్ రెడ్డికే ఇస్తారని ఆశించినా బీజేపీ అధిష్టానం మాత్రం వీరు ఎవరిని కాదని.. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న బీజేపీ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన బండికి పట్టం కట్టింది.