Begin typing your search above and press return to search.

వివాదాస్ప‌ద సీరియ‌ల్ పై స్మృతి ఫైర్‌!

By:  Tupaki Desk   |   14 Aug 2017 12:49 PM GMT
వివాదాస్ప‌ద సీరియ‌ల్ పై స్మృతి ఫైర్‌!
X
వెండితెర‌కు దీటుగా బుల్లితెర‌కు అభిమానులు నానాటికీ పెరిగిపోతున్నారు. దీంతో టీఆర్పీల‌ను పెంచుకోవ‌డానికి టీవీ చానెళ్లు సీరియ‌ళ్ల‌లో లేడీ విల‌నిజాన్ని ఓ రేంజ్ కు తీసుకెళ్లారు. అంత‌టితో ఆగ‌కుండా ఇత‌ర భాషా సీరియ‌ళ్ల‌ను పోటీలుప‌డి మ‌రి తెలుగులో డ‌బ్ చేసి ప్ర‌సారం చేస్తున్నారు. అంతే కాకుండా రేటింగ్ లకు క‌క్కుర్తి ప‌డి వెరైటీ కాన్సెప్ట్ ల పేర్ల‌తో నానా ర‌చ్చ చేస్తున్నారు. అదే త‌ర‌హాలో సోనీ చానెల్ లో ప్ర‌సార‌మవుతున్నహిందీ సీరియ‌ల్‌ `పెహ్రేదార్ పియా కీ` పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆ సీరియ‌ల్ ను బ్యాన్‌ చేయాలంటూ ఏకంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కొంత‌మంది విజ్ఞప్తి చేస్తున్నారంటే ఆ సీరియ‌ల్ లో కాన్సెప్ట్‌ ఎంత జుగుప్సాక‌ర‌మైన‌దో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ విజ్ఞప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న స్మృతి ఇరానీ స‌ద‌రు సీరియ‌ల్ పై సీరియస్‌ గా స్పందించారు. దాని ప్ర‌సారాల‌పై స‌త్వ‌ర చర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

సోనీ టీవీలో ప్రసారమ‌వుతున్న `పెహ్రేదార్ పియా కీ` సీరియ‌ల్ లో 9 ఏళ్ల బాలుడిని 18 ఏళ్ల యువతిపెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ పెళ్లి ఏ ప‌రిస్థితుల్లో జ‌రిగింది, పెళ్ల‌య్యాక ప‌ర్య‌వ‌సానాలు ఏమిటి అనే క‌థాంశంతో ఈ సీరియ‌ల్ ప్రైమ్ టైమ్‌ లో ప్ర‌సార‌మ‌వుతోంది. ఈ మధ్య కొన్ని ఎపిసోడ్లలో శోభనం రాత్రి - హనీమూన్‌ వంటి రిఫరెన్స్‌ లతో కూడిన కొన్ని సన్నివేశాలను చూపించటంపై ప‌లువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ త‌ర‌హా కాన్సెప్ట్‌ సీరియ‌ల్ ప్రేక్షకులపై , అందులోనూ పిల్ల‌ల‌పై తీవ్ర ప్రభావం చూపటంతోపాటు, పిల్లల ఆలోచ‌నా విధానాల‌ను పెడ‌దోవ ప‌ట్టించేలా ఉంద‌ని ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

ఛేంజ్‌.ఓఆర్‌ జీ వెబ్‌ సైట్‌ లో మాన్సి జైన్‌ అనే పిటిషనర్‌ ఈ సీరియల్‌కు విరుద్ధంగా ఆన్‌ లైన్‌ సంతకాల సేకరణ చేపట్టారు. 50,000 కు మంది పైగా ఆ సీరియ‌ల్ కు వ్య‌తిరేకంగా సంత‌కాలు చేశారు. మాన్సిజైన్‌ పిటిష‌న్‌ కు భారీస్థాయిలో మద్దతు లభిస్తుండటంతో కేందమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఆ సీరియల్‌ పై వెంటనే చర్యలు తీసుకోవాలని బ్రాడ్‌ కాస్టింగ్‌ కంటెంట్‌ కంప్లైట్స్‌ కౌన్సిల్‌ (బీసీసీసీ)కు లేఖ రాశారు. ఆ వివాదాస్పద సీరియల్‌ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆ సీరియల్‌ ప్రసారాలపై వెంట‌నే చర్య తీసుకోవాలని లేఖలో కోరారు.