Begin typing your search above and press return to search.

తన గతాన్ని చెప్పి కదిలిపోయేలా చేసిన స్మృతి

By:  Tupaki Desk   |   28 Nov 2016 4:21 AM GMT
తన గతాన్ని చెప్పి కదిలిపోయేలా చేసిన స్మృతి
X
మోడీ కేబినెట్ లోని మంత్రుల్లో స్మృతి ఇరానీ ఎపిసోడ్ కాస్త భిన్నమైనది. ఆమె గతం గురించి విన్న వారంతా కదిలిపోతారు. ఆమె పడిన కష్టాల విన్న వారంతా.. విపరీతమైన స్ఫూర్తిని పొందుతారు. పైకి రావాలంటే స్వయం కృషిని మించింది మరొకటి లేదని నమ్ముతారు. మొత్తంగా స్మృతి ఇరానీకి పిధా అయిపోతారు. నిరుపేదకుటుంబం నుంచి అంచలంచెలుగా పైకి వచ్చిన విషయం తెలిసిందే. తన మాటలతో.. చేష్టలతో తరచూ వార్తల్లో కనిపించే ఆమె.. తాజాగా తన తెగిన చెప్పును కుట్టించుకునే విషయంలో ఆమె వ్యవహారశైలి మీడియా దృష్టిని ఆకర్షించింది.

అదే సమయంలో ఆమె సింఫుల్ సిటీతో దేశ ప్రజల దృష్టిని తన మీద పడేలా చేసుకున్నారు. కాఫీ షాప్ కు.. ఇతరపనులకు తనకుతానే స్వయంగా వెళ్లే అలవాటున్న స్మృతి ఇరానీకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు తరచూ బయటకు వస్తుంటాయి. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్నా.. డాబుసరికి దూరంగా ఉంటూ.. సామాన్యులతో కలిసిపోయే ఆమె తత్వం సగటు రాజకీయ నేత తీరుకు భిన్నంగా ఉంటుందని చెప్పక తప్పదు.

తాజాగా తమిళనాడులో పర్యటిస్తున్న ఆమె.. కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రానికి వెళ్లారు. అక్కడ పలువురు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ సందర్భంలో తన గతాన్ని ఆమె చెప్పాల్సి వచ్చింది.ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో చిన్నతనంలో తాను పడిన కష్టాల్ని ఆమె వివరించారు. ఢిల్లీలోని ఒక మురికివాడలో తాను పెరిగిన విషయాన్ని చెప్పిన ఆమె.. తన కుటుంబ వివరాల్ని వెల్లడించారు.

తన తండ్రి ఒక హోటల్ లో పని చేసేవారి.. ఆయన తీసుకొచ్చిన వాటిని తనతో పాటు తనముగ్గురు అక్కలకు ఆహారంగా ఉండేవని చెప్పుకొచ్చారు. పూట గడవని కుటుంబం నుంచి తాను వచ్చినట్లుగా చెప్పిన ఆమె.. తమపై దేవుడి కరుణ ఉందని వ్యాఖ్యానించారు. తాను పుట్టి పెరిగిన గుడిసెకు ఎదురుగానే ప్రస్తుతం తాను బంగళాలో ఉంటున్న విషయాన్ని చెప్పిన ఆమె.. కష్టపడి తాను పైకి వచ్చానని.. కష్టం విలువ తనకు తెలుసని వ్యాఖ్యానించారు. అత్యున్న స్థాయికి ఎదిగిన వారు తమ గతంలోని నీడల గురించి చెప్పుకోవటానికి పెద్దగా ఇష్టపడరు.కానీ.. స్మృతి మాత్రంఅందుకు భిన్నంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవటానికి ఏ మాత్రం వెనుకాడరు. సిగ్గుపడరు. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పేందుకు సంశయించని ఆమె తీరు అందరిని ఆకట్టుకోవటమే కాదు కదించేలా చేస్తుంటాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/