Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రిగారి పంచ్ అదిరిపోలేదా?

By:  Tupaki Desk   |   7 July 2016 8:39 AM GMT
కేంద్ర మంత్రిగారి పంచ్ అదిరిపోలేదా?
X
కేంద్ర జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్మృతి ఇరానీ త‌న దూకుడు ఏ మాత్రం త‌గ్గించుకోలేదు. తనను మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి మార్చ‌డం గురించి విలేఖరుల ప్రశ్నలకు సమాధానంగా ఓ పాపులర్ హిందీ పాటను ఉదహరిస్తూ ఘాటు రిప్లై ఇచ్చారు. పైగా త‌న‌కు కొత్త బాధ్య‌త‌లు ద‌క్క‌డంపై ఆమె రిప్లై ఉండ‌టం ఆస‌క్తిక‌రం.

ఉత్తరప్రదేశ్‌ లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మరింత ఎక్కువ సమయం ఇవ్వడానికి ఈ మార్పు చేశారా? అని విలేఖరులు అడగ్గా ఆమె నవ్వుతూ, ‘కుఛ్‌ తో లోగ్ కహేంగే లోగోంకా కామ్ హై కహనా’ (జనం ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడడమే వాళ్ల పని) అనే పాపులర్ హిందీ సినిమా పాటను ఉదహరించారు. టీవీ నటిగా పాపులర్ అయిన స్మృతి ఇరానీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేయడం ద్వారా ఒక్కసారిగా రాజకీయ రంగంలోకి రావడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినప్పటికీ బిజెపి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమెకు మానవ వనరుల మంత్రిత్వ శాఖ అప్పగించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. కాగా - జౌళి శాఖ బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్తూ - నూతన బాధ్యతలకు న్యాయం చేకూర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. చేనేత కార్మికులందరూ తనకు మద్దతు ఇస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.