Begin typing your search above and press return to search.

తెలంగాణ‌పై స్నాప్ డీల్ సీఈఓ కామెంట్ ఇది

By:  Tupaki Desk   |   19 Dec 2016 5:28 AM GMT
తెలంగాణ‌పై స్నాప్ డీల్ సీఈఓ కామెంట్ ఇది
X
ఈ కామర్స్ దిగ్గ‌జం స్నాప్‌ డీల్ సీఈవో కునాల్ బహాల్ తెలంగాణ రాష్ట్రంపై ప్రశంసలు గుప్పించారు. తెలంగాణ అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా నిలుస్తున్నదని కునాల్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ కామర్స్ లావాదేవీల్లో ఎంట్రీ ట్యాక్స్ విధించని అతికొద్ది రాష్ట్రాల‌లో తెలంగాణ ఒకటని కునాల్ బహాల్ త‌న భావాన్ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ ఆసక్తికరమైన ప్రతిపాదన పెట్టారు. స్నాప్‌ డీల్‌ కు చెందిన టెక్ సెంటర్‌ ను హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసేలా ఆలోచించాలని కోరారు.

ఇదిలా ఉండ‌గా ఉద్యోగార్థుల‌కు చేదు వార్త ఒక‌టి వెలువ‌డింది. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు, నోట్ల రద్దు పరిణామంతో వ్యాపారం కుంటుపడిన నేపథ్యంలో ఈ ఏడాది జాబ్ మార్కెట్ పలు సవాళ్లు ఎదుర్కొంది. వచ్చే ఏడాదిలోనూ పరిస్థితి సవాళ్లమయంగానే కన్పిస్తున్నదని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే కంపెనీ యాజమాన్యాలు నియామకాల విషయంలో వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తున్నాయని, ఈసారి వేతన పెంపు గణాంకాలను బట్టి చూస్తే వ్యాపార పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని సంకేతాలొస్తున్నాయని అంటున్నారు.నెల ప్రాతిపదిక చూస్తే.. 2015లో కంటే ఈ ఏడాది నియామకాల వృద్ధి తగ్గిందని విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాదు ఈసారి జీతాల పెంపు గరిష్ఠంగా 20 శాతం, సరాసరిగా 10 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. నిజానికి పెరిగిన జీతాలు మాత్రం తక్కువే.

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడం, దేశీయంగా నోట్ల రద్దు పరిణామంతో వచ్చే ఏడాది కొన్ని రంగాల్లో ఉద్యోగ నియామకాలపై తీవ్ర ప్రభావం పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కామర్స్, ఎఫ్‌ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగాలు ఈ ఏడాది తొలినాళ్లలో మెరుగైన పనితీరు కనబర్చినప్పటికీ.. పెద్ద నోట్ల రద్దుతో ప్రస్తుతం పూర్తిగా చతికిలపడ్డాయి. వచ్చే రెండేండ్లు భారత్‌లో నియామకాలు మందకొడిగానే కొనసాగవచ్చని అంటల్ ఇంటర్నేషనల్ ఇండియా ఎండీ జోసెఫ్ దెవాసియా అన్నారు. నోట్ల రద్దుతో దేశీయ జాబ్ మార్కెట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. రియల్ ఎస్టేట్ - నిర్మాణం - మౌలిక సదుపాయాలు - అధిక విలువ చేసే వాహనాల రంగాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపనుందంటున్నారు. వచ్చే ఏడాది కాలంలో నియామకాలపై 31 శాతం కంపెనీలు మాత్రం ఆశావాహంగా ఉన్నాయని విల్లీస్ టవర్స్ వాట్సన్ సంస్థ పేర్కొంది. 2011 తర్వాత మళ్లీ మొదటిసారిగా ఉద్యోగుల జీతాల పెంపు శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుందని అంచనా వేస్తున్నది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/