Begin typing your search above and press return to search.

మ‌గ‌త‌నాన్ని చంపేస్తున్న స‌బ్బులు, షాంపూలు..!

By:  Tupaki Desk   |   20 March 2021 5:30 AM GMT
మ‌గ‌త‌నాన్ని చంపేస్తున్న స‌బ్బులు, షాంపూలు..!
X
మీ ఇంట్లోనో.. చుట్టుప‌క్క‌ల‌నో.. చివ‌ర‌కు మీ ఊళ్లోనో.. ఇలాంటి కేసు ఒక్క‌టైనా క‌నిపిస్తుంది. మీరు వినే వింటారు.. లేదంటే చూసే ఉంటారు.. మ‌రీ విషాద‌మైతే అది మీరే కూడా అయి ఉంటారు! ‘మీ స్పెర్మ్ కౌంట్ త‌గ్గిపోయింది’ అని డాక్టరు చెప్పడం! ఇప్పుడు పెళ్లైన‌ యువ‌త ఎదుర్కొంటున్న అతిపెద్ద స‌మ‌స్య‌ల్లో ఇదికూడా ఒక‌టిగా త‌యారైంది!

అంద‌రూ సంతోషంగా పెళ్లి చేస్తారు.. న‌వ‌దంప‌తులు ఆనందంగా గ‌డుపుతుంటారు.. కానీ, ఆ నందం ఫ‌ల‌వంత‌మ‌య్యే క్ష‌ణం మాత్రం ఎంత‌కీ రాదు! ఎదురు చూపులు మొద‌ల‌వుతాయి.. నెల‌లు, సంవ‌త్స‌రాలు గ‌డిచిపోతూనే ఉంటాయి.. కానీ అమ్మాయి క‌డుపు మాత్రం పండ‌దు! మూడు, నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డిచిన త‌ర్వాత కార‌ణ‌మేంట‌ని వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్తే.. వారు చెప్తారు! అమ్మాయికి పీసీఓడీ ప్రాబ్లం వ‌చ్చింద‌నో.. లేదంటే, అబ్బాయికి వీర్య‌క‌ణాల సంఖ్య త‌గ్గింద‌నో! ఇక‌, త‌ప్పని ప‌రిస్థితుల్లో.. స‌హ‌జంగా వృద్ధి చెందాల్సిన వీర్య‌క‌ణాల‌కు మందులు పోసి పెంచుతుంటారు!

ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చింద‌ని బాధ‌ప‌డుతుంటారే కానీ.. ఎందుకు వ‌చ్చింద‌ని చాలా మంది ఆలోచించ‌రు. ఒకవేళ ఆలోచించినా ఆన్స‌ర్ దొర‌క‌దు. కానీ.. ఇప్పుడు దొరికింది. ఈ ప‌రిస్థితి ఇంట్లో మూల‌లా నిండిపోయిన ర‌సాయ‌నాలే కార‌ణ‌మ‌ని! మ‌నిషి జీవితంతో విడ‌దీయ‌లేకుండా క‌లిసిపోయిన కెమిక‌ల్సే అస‌లు శ‌త్రువుల‌ని! ‘కౌంట్ డౌన్’ అంటూ ఇటీవల వ‌చ్చిన ఓ పుస్త‌కం ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యాల‌ను వెల్ల‌డించింది. 1973తో పోలిస్తే.. ఇప్పుడు ఏకంగా 60 శాతం మేర వీర్య‌క‌ణాల సంఖ్య త‌గ్గిపోయింద‌ని ప్ర‌క‌టించింది!

దీనికి కార‌ణం ఒక్క‌ట‌ని లేదు.. అన్నీ ఉన్నాయి. నీళ్లు తాగే ప్లాస్టిక్ బాటిల్స్‌.. కూర‌గాయ‌ల‌కు వాడే పాలిథీన్ క‌వ‌ర్స్‌, స‌బ్బులు, సెంట్ల‌లో వాడే ర‌సాయ‌నాలు, ఆహార ప‌దార్థాల ప్యాకింగ్ కు వాడే ర్యాప‌ర్స్ అన్నీ క‌లిసి పురుషుడి మ‌గ‌త‌నాన్ని దెబ్బ‌తీస్తున్నాయి. కేవ‌లం వీర్య‌క‌ణాల సంఖ్య మాత్ర‌మే కాకుండా.. అంగం సైజును కూడా త‌గ్గించి పారేస్తున్నాయి!

ఈ పుస్త‌కం ఇంకా చాలా చెప్పింది. ముత్తాత సామ‌ర్థ్యంతో పోలిస్తే.. ఇప్ప‌టి యువ‌తలో వీర్య క‌ణాలు స‌గానికి‌పైగా త‌గ్గిపోయాయ‌ట‌. మ‌హిళ‌ల్లోనూ ముత్త‌వ్వ‌తో పోలిస్తే 35 ఏళ్లు వ‌చ్చేస‌రికి గ‌ర్భం ధ‌రించే శ‌క్తి కోల్పోయిన‌ట్టు ప్ర‌క‌‌టించింది. ఈ ప‌రిస్థితి కార‌ణ‌మైన కెమిక‌ల్స్ నిషేధానికి కొన్ని దేశాలు క‌ఠినంగా ఉన్నాయి. పూర్తిగా నిషేధించాయి. మ‌రికొన్ని ప్ర‌య‌త్నాల్లో ఉన్నాయి. ఇంకొన్ని దేశాలు అస‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం! మ‌న‌దేశంలో ఈ ర‌సాయ‌నాల ప‌రిస్థితి ఎలా ఉందో తెలిసిందే. ఇక‌నైనా జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే.. 2045 నాటికి వీర్య‌క‌ణాల సంఖ్య సున్నాకు ప‌డిపోయినా ఆశ్చ‌ర్యం లేద‌ని తెలిపింది. ఆ త‌ర్వాత మీ ఇష్టం!