Begin typing your search above and press return to search.

ఏపీ ఐటీ మినిస్టర్ కి ప్రశ్న : కనీసం ఎంఓయూలు అయినా చూపిస్తావా...?

By:  Tupaki Desk   |   1 Jun 2022 9:30 AM GMT
ఏపీ ఐటీ మినిస్టర్ కి ప్రశ్న : కనీసం ఎంఓయూలు అయినా చూపిస్తావా...?
X
ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరానాధ్ కి సూటి ప్రశ్నను నెట్ జనాలు సంధిస్తున్నారు. ఉట్టిగా ఏవేవో చెప్పడం కాదు, ఏపీకి లక్షా పాతిక వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పడం కూడా కాదు, వాటికి సంబంధించి కనీసం ఆయా పరిశ్రమల అధిపతులతో ఒప్పందాలను చేసుకున్న వాటిని బయటపెట్టాలని కోరుతున్నారు.

అలాగే ఎం ఓ యూలు ఏమైనా ఉంటే కూడా వాటిని వెలికి తీయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అపుడే కదా జనాలకు నమ్మకం కలుగుతుందని కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అంటున్నారు. మరి దీని మీద మంత్రి గారే జవాబు చెప్పాల్సి ఉంది.

దావోస్ టూర్ ని ముగించుకు విశాఖ వచ్చిన మంత్రి మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి మరీ ఏపీకి లక్షా పాతిక వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చాలా బిగ్ ఫిగర్ నే చెప్పేశారు. మరి ఆ ఫిగర్ చూడడానికి బాగా ఉంది. అన్నేసి పెట్టుబడులు ఏపీకి వస్తే నిజంగా ఏపీ స్వర్గధామమే అవుతుంది. కానీ వాటికి సంబంధించి ఎం ఓ యూలు చూపించాలి కదా అని లాజికల్ గానే నెటిజన్లు అడుగుతున్నారు.

ఇక చూస్తే గుడివాడ విశాఖలో మీడియాతో చాలానే చెప్పారు. అందులో ఏపీలో పెట్టుబ‌డుల‌కు గ‌ల అవ‌కాశాల‌ను సీఎం జ‌గ‌న్ నేతృత్వంలోని త‌మ బృందం పారిశ్రామిక‌వేత్త‌ల‌కు వివరించామ‌ని మంత్రి చెప్పారు. దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియ‌న్ కేంద్రంగా పెద్ద సంఖ్య‌లో చర్చ‌లు జ‌రిగాయ‌ని ఆయన వివరించారు. ఇక దేశీయ పారిశ్రామిక‌వేత్త‌లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌ల‌తో పాటు ప్ర‌పంచ ప్ర‌సిద్ది గాంచిన పారిశ్రామిక‌వేత్త‌లు కూడా ఈ చ‌ర్చ‌ల్లో పాలుపంచుకున్నార‌ని తెలిపారు.

అదే విధంగా విశాఖఖ కేంద్రంగా యూనీకార్న్ హ‌బ్ ఏర్పాటు దిశ‌గా తాము చేప‌ట్టిన చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇచ్చాయ‌ని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే విశాఖ‌లో ఉన్న త‌మ ప్లాంట్ విస్త‌ర‌ణ కోసం ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ ఎండీ మ‌రో రూ.1,000 కోట్ల పెట్టుబ‌డుల‌ను ప్ర‌క‌టించార‌ని ఆయ‌న వివ‌రించారు. ఆదానీతో చర్చలు జరిగాయని ఆయన అంటున్నారు. అరవై వేల కోట్ల పెట్టుబడులు కూడా ఏపీకి రానున్నాయని గుడివాడ చెప్పేశారు.

ఇవన్నీ ఎలా ఉన్నా ఎం ఓ యూలను చూపించు గుడివాడ అని మాత్రం నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఏపీకి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే కనుక అది ముఖ్యమంత్రి స్థాయిలోనే మీడియా మీట్ ఏర్పాటు చేసి చెప్పాల్సిన వార్తగా కూడా అంటున్నారు. కానీ గుడివాడ విశాఖలో చాలా సింపుల్ గా ఈ విషయాలు చెప్పడం అంటే మీడియా ముఖంగా దాన్ని అలా విని వదిలేయాలా లైట్ తీసుకోవాలా అన్న చర్చ వస్తోంది. ఏది ఏమైనా దావోస్ టూర్ మీద పూర్తిగా వివరాలతో అన్ని విషయాలు చెబితేనే జనాలకు విశ్వాసం కలుగుతుందని కూడా అంటున్నారు. మరి మంత్రి గుడివాడ దానికి రెడీనా.