Begin typing your search above and press return to search.

లోన్ కావాలా... నీ ప్రవర్తన బాగుందా?

By:  Tupaki Desk   |   24 Oct 2016 7:42 AM GMT
లోన్ కావాలా... నీ ప్రవర్తన బాగుందా?
X
అప్పు కోసం చెప్పులరిగేదాకా తిరగాల్సి వచ్చేది అనే మాట గతం. అప్పట్లో రూపాయి అప్పు దొరకాలంటే దిమ్మతిరిగి పోయేది అని చాలా మంది చెప్పేవారు. అయితే కాల క్రమంలో కేవలం మొబైల్ యాప్స్ ద్వారానే అవసరమైనప్పుడు ఎంతో సులభంగా, అంతే వేగంగా రుణం అందిస్తున్నాయి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు. బ్యాక్ స్టేట్ మెంట్ - పే స్లిప్ - పాన్ కార్డు - ఆధార్ కార్డు లాంటి వాటికి ఒక ఫోటో జతచేస్తే చాలు చిన్నచిన్న వెరిఫికేషన్లతోనే రుణాలు అందించే ఆన్ లైన్ లెండర్ కంపెనీలు రోజురోజుకూ వృద్ధిచెందుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ కూడా గతమే! ఎందుకంటే... ఇకముందు కూడా అప్పు అంత ఈజీగా దొరకదంట. దీనికి కారణం కొన్ని కఠిన నిబంధనలు వస్తున్నాయి. నిబంధనలంటే గ్యారంటీ చూపడమో, డాక్యుమెంటేషన్ పక్కాగా ఉండటమో కాదు... మన ప్రవర్తన కూడా బాగా కాపాడుకోవడం!

వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం!! ఇకపై ఆన్ లైన్ క్రెడిట్ పొందాలంటే సోషల్ మీడియాలో కూడా మీ ప్రవర్తన బాగుండాలి. మీరు పెట్టే స్టేటస్ లు - రాసే కామెంట్లు - తిరిగే ప్రదేశాలు అన్నీ క్రమపద్ధతిలో ఉండాలి. అవి ఏమాత్రం మోసపూరితంగానో, అక్రమంగానో ఉంటే మాత్రం రుణం దక్కదు. ఈ మేరకు కస్టమర్ల సోషల్ మీడియా బిహేవియర్ ను సమగ్రంగా పరిశీలించేందుకు ఆయా ఆన్ లైన్ లెండర్స్ ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈ మేరకు ఆర్టిఫిషియల్స్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా తనిఖేచేస్తామని, అంతా ఓకే అనుకుంటే తప్ప లోన్ ఇవ్వబోమని చెబుతున్నారు.

ఇదే క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ - ట్రాఫిక్ రూల్స్ వాయిలేషన్స్ కు సదరు కస్ట్ మర్ పాల్పడ్డారా లేదా అనేది కూడా తాము కనిపెట్టగలమని, ఇంతకుముందు ఏదైనా యాప్ లేదా సాధారణ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టిన విషయాన్ని కూడా పసిగట్టగలమని క్యాష్-ఈ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఇకపై కేవలం డాక్యుమెంట్లే కాదు, కస్టమర్ ఎలాంటివాడో పరిశీలించిన తర్వాతే రుణం మంజూరుచేస్తామని అంటున్నారు. ఇదంతా చదివాక "ఈజీగా లోన్ తీసుకోవడం కష్టమే!" అని అనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదు... మీరు క్రమశిక్షణగా ఉండి, మీ మీ ప్రవర్తన సదరు లోన్ ప్రొవైడర్లకు నచ్చినప్పుడు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/