Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా తంటా.. ఎరక్కపోయి ఇరుక్కుపోతున్న ఎన్నారైలు

By:  Tupaki Desk   |   23 Jan 2022 7:30 AM GMT
సోషల్ మీడియా తంటా.. ఎరక్కపోయి ఇరుక్కుపోతున్న ఎన్నారైలు
X
సోషల్ మీడియా కత్తిలాంటిది. దీనితో కూరగాయలు కోయవచ్చు. మనిషి ప్రాణాలు తీయవచ్చు. సామాజిక మాధ్యమాలతో మంచి ఎంత ఉందో చెడు ప్రభావం కూడా అంతే ఉంది. దీనిపై సరైన అవగాహన లేక ఎంతో మంది లేనిపోని తలనొప్పులను కొని తెచ్చుకుంటున్నారు. వీటివల్లే సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సామాజిక మాధ్యమాలు గల్ఫ్ లో ఉండే ఎన్నారైలకు పెద్ద చిక్కులే తీసుకొస్తున్నాయి. సాయం కోసం వీటిని ఉపయోగిస్తే.. కటకటాల పాలు కావాల్సి వస్తోంది.

చట్టాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా సోషల్ మీడియాల్లో స్పందిస్తున్న ఎన్నారైలకు ఈ చిక్కులు తప్పడం లేదు. సాయం కావాలంటూ పోస్ట్ చేస్తే చాలు.. జైలు పాలవుతున్నారు. అంతేకాకుండా దేశ బహిష్కరణకు గురవుతున్నారు. అప్పులు చేసి మరీ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ప్రవాసులకు... సామాజిక మాధ్యమాలు లేనిపోని తంటాలు తీసుకొస్తున్నాయి. ఎంతో వ్యయప్రయాసాలకోర్చి దేశంకాని దేశం పోయి.. ఉత్త చేతులతోనే వస్తున్నారు.

తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి సౌదీ అరేబియా జైళ్లో శిక్ష అనుభవించి ఇటీవలె స్వదేశానికి తిరిగివచ్చాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన సురేందర్ నగవత్ నాయక్ పనికోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఆ దేశంలోని ఓ ప్రధాన నగరం జుబైల్ లో నివసించే ఓ కుటుంబానికి డ్రైవర్ గా పనికి కుదిరాడు. రెండేళ్లు పని చేసేటట్లు ఒప్పందం పెట్టుకున్నారు. అయితే రెండేళ్లు గడిచినా కూడా యజమాని తనను ఇంటికి పంపలేదని బాధితుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. స్వదేశానికి పంపమంటే రేపు మాపు అంటూ ఆలస్యం చేస్తున్నారని వాపోయాడు. ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అయింది. అక్కడా ఇక్కడా షేర్ అవుతూ... సురేందర్ యజమానికి చేరింది.

సురేందర్ వీడియోపై ఆగ్రహానికి గురైన యజమాని... పోలీసులను ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టాడంటూ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేశారంటూ అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అతడికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తికాగానే దేశ విడిచిపోవాలని ఆదేశించింది. అంతేకాకుండా అతడి ఫోన్ కూడా సీజ్ చేసింది. ఈ విషయాన్ని సురేందర్ తన ప్రవాసభారతీయ మిత్రులైన రాజేష్, యాసిన్లకు తెలియజేశాడు. వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఎంబసీ స్పందించింది. ఈ మేరకు అధికారులు అక్కడి అధికారులతో మాట్లాడారు. సురేందర్ కు జైలు శిక్ష తగ్గించారు. అనంతరం సౌదీని వదిలి.. స్వదేశానికి చేరుకున్నారు.

ఈ విధంగా ప్రవాస భారతీయులు ఎరక్కపోయి ఇరుక్కుపోతున్న ఘటనలు తరుచూ వార్తల్లోకి వస్తూనే ఉన్నాయి. సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి చాలామంది సౌదీ అరేబియా జైళ్లలో మగ్గుతున్నారని తెలుస్తోంది. మిగిలిన వారంతా కూడా సోషల్ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల వినియోగం మంచీ, చెడూ రెండూ చేస్తుందని అంటున్నారు. ఏదైనా పోస్టు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా.