Begin typing your search above and press return to search.

ఆనందయ్య ఎపిసోడ్ లో అతి చేస్తే.. ఇలాంటి పంచ్ లే!

By:  Tupaki Desk   |   29 May 2021 4:48 AM GMT
ఆనందయ్య ఎపిసోడ్ లో అతి చేస్తే.. ఇలాంటి పంచ్ లే!
X
కేవలం క్రిష్ణపట్నం.. కాదంటే కాస్త ఆ చుట్టుపక్కల వారికి మాత్రమే సుపరిచితుడైన ఆనందయ్య.. మీడియా పుణ్యమా అని.. సోషల్ మీడియా దెబ్బకు ఒక్కసారిగా ఆయన పేరు కోట్లాది మందికి సుపరిచితం కావటమే కాదు.. ఇప్పుడు ఆయన మీద ఏడతెగని చర్చ నడుస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు తోపుల్లాంటి కార్పొరేట్ ఆసుపత్రులు లక్షలు తీసుకుంటే కానీ వైద్యం చేయని వేళ.. చిన్న ఆసుపత్రి నుంచి ధర్మాసుపత్రి వరకు ఆసుపత్రుల్లో చేర్చుకొని వైద్యసేవలు అందించేందుకు కిందా మీదా పడుతున్న వేళ.. అందుకు భిన్నంగా తన వద్దకు వచ్చిన వేలాది మందికి తాను తయారు మందును ఇవ్వటం తెలిసిందే. అది కూడా ఉచితంగా. ఒక్క పైసా తీసుకోకుండా.

ఇప్పటివరకు ఆనందయ్య ఇచ్చిన మందుతో నాశనమైపోయానని కానీ.. దారుణంగా దెబ్బ తిన్నానంటూ ఏ ఒక్కరూ బయటకు వచ్చి కంప్లైంట్ చేయటం లేదు. ఎంత ఉచితమైనా.. లెక్క తేడా వస్తే.. చితక బర్రె తీసుకొని మనోళ్లు ఎంతలా చెలరేగిపోతారో తెలిసిందే. అలాంటిది.. ఆనందయ్య విషయంలో ఆయన మందును వాడినోళ్లు కించిత్ మాట కూడా ఆనకపోవటం గమనార్హం. ఆయన మందు అశాస్త్రీయమని వాదించే వారు మినహా.. ఆయన మందు వాడినోళ్లు పల్లెత్తు మాట అనటం లేదు సరి కదా.. ఆయన్ను తొందరపడి ఏదైనా మాట అనేందుకు సైతం ఒప్పుకోటం లేదు.

ఇలాంటివేళ.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సిన మీడియాలోని కొన్ని సంస్థలు.. అందుకు భిన్నంగా ఆనందయ్య మందుపై తమ తీర్పుల్ని ప్రజల మీద రుద్దేయటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక ప్రముఖ ఛానల్ ఆనందయ్య మందుకు వ్యతిరేకంగా ఒక స్టాండ్ తీసేసుకుంది. అందుకు తగ్గట్లే తన కార్యక్రమాల్ని ప్రసారం చేస్తోంది.

దీనిపై పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్య మందుపై అధికారులు ప్రాథమికంగ పరీక్షలు జరిపి తప్పు లేదని చెప్పిన తర్వాత కూడా.. సదరు చానల్ ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటివేళ.. సదరు చానల్ తోపాటు.. ఆనందయ్య మందును తప్పు పట్టే వారికి షాకిచ్చే సెటైర్లు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువ అవుతున్నాయి. అలాంటిదే ఒకటి ఆసక్తికరంగానే కాదు.. పెద్ద ఎత్తున షేర్ అవుతున్న ఈ పోస్టు చదివితే ముఖాన నవ్వు రావటమే కాదు.. ఇదీ పాయింటే అన్న భావన కలుగక మానదు. ఆలోచించేలా ఉన్న ఈ పోస్టులో సదరు మీడియా చానల్ పేరును మినహాయించి.. మిగిలినదంతా యథాతధంగా ఇచ్చేస్తున్నాం.

నేను పుట్టినపుడు గట్టిగా గొంతు చించుకుని ఏడ్వలేదని, ఏ సర్టిఫికేట్ లేని మా నాయనమ్మ, ఏ విధమైన క్లీనికల్ ట్రయల్స్ జరపని 'వస' నా గొంతులో పోసింది

నాకు జ్వరం వస్తే స్పృహలేని స్థితిలో ఉన్న నా భుజంమీద పసివాడిననే జాలికూడా లేకుండా, దీపం మీద పిన్నీసు ఎర్రగా కాల్చి వాతపెట్టింది

తాగిన పాలు జీర్ణం చేసుకోలేక వాంతి చేసుకున్నానని పొట్టమీద అడ్డంగా వాతపెట్టింది
కడుపునొప్పిలేస్తే గొంతు మంటమండే వాముపాలు పోసింది

చెవిపోటుకు సొరాకు పసరుపోసింది
తేలు కుడితే తగరవిశ ఆకు పసరు పోసి క్షణంలో నయం చేసింది
కామెర్లయితే కటిక చేదుగా ఉండే నేల ఉసిరి పసరు తాగించింది
పైత్యపు దద్దులు వస్తే అల్లపు రసం తాగించింది
ప్రతి తొలకరి ముందు బలవంతాన విషంలాంటి ఆముదం తాగించింది
ఇలా అశాస్ర్రీయమైన, హింసాత్మకపు పనులు నామీద చాలానే చేసింది
కానీ నన్ను బ్రతికించింది..
కానీ నాకు ఆ చానల్ చూశాక ఈమధ్యనే తెలిసింది.. నన్ను బ్రతికించిన మా నాయనమ్మ నేరస్తురాలనీ, ఆమె చేసిన పనికి అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించవచ్చని!