Begin typing your search above and press return to search.

గుడ్ మార్నింగ్ సీఎం సార్.. హోరెత్తిన సోష‌ల్ మీడియా!

By:  Tupaki Desk   |   16 July 2022 5:19 AM GMT
గుడ్ మార్నింగ్ సీఎం సార్.. హోరెత్తిన సోష‌ల్ మీడియా!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రోడ్లు దారుణ ప‌రిస్థితుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మొద్దు నిద్ర పోతోంద‌ని ఆరోపిస్తున్నారు. పైగా ఈ రోడ్ల‌న్నీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలోనే పాడ‌య్యాయ‌ని.. నెపాన్ని ఆయ‌న‌కు మీద‌కు నెట్టేయ‌డంపై కూడా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా రోడ్ల దుస్థితిని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ దృష్టికి తెచ్చేందుకు జ‌న‌సేన పార్టీ #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్‌తో డిజిటల్ క్యాంపెయిన్ మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. జూలై 15, 16, 17 తేదీల్లో మూడు రోజుల‌పాటు ఈ డిజిటల్ క్యాంపెయిన్ ఉంటుంద‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌న‌సేన పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు పాడైన రోడ్ల ఫొటోల‌ను తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.

ప్ర‌స్తుతం భారీ వర్షాలతో అధ్వాన్నంగా మారిన రోడ్లకు సంబంధించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు సీఎం జగన్‌కు తెలిసేలా జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపు మేరకు డిజిట‌ల్ క్యాంపెయిన్ చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్‌కు విశేష స్పందన వస్తోంది.

జూలై 15 ఉదయం 8 గంటలకు పవన్ కోనసీమలో కొత్తపేట దగ్గర రోడ్డు ఛిద్రమై ఉన్న వీడియోను పోస్ట్ చేసి #GoodMorningCMSir అని ట్యాగ్ చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేక వ్యంగ్య చిత్రాన్ని ట్వీట్ చేశారు. అప్పటి నుంచి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. తొలి రెండు గంటల్లోనే ట్రెండింగ్‌లో ట్వీట్స్ మొదలై అగ్రస్థానానికి చేరింది.

తొలి రోజు జూలై 15న‌ #GoodMorningCMSir హ్యాష్ ట్యాగుకు ఏకంగా 3.55 లక్షల ట్వీట్స్ వచ్చాయి. ఈ ట్వీట్స్ 218 మిలియన్ల మందికి చేరువైనట్లు ట్విట్ట‌ర్ గణాంకాలు చెబుతుండ‌టం విశేషం. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతోపాటు యువత భారీగా పాల్గొన్నారు.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండపేట నుంచి కోరుమిల్లి, కపిలేశ్వరపురం వెళ్ళే రోడ్డులోని గోతులను చూపిస్తూ ట్వీట్ చేశారు. అలాగే కోరుమిల్లి – జొన్నాడ రోడ్డునీ, కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం-కాకినాడ ప్రధాన రోడ్డు దుస్థితిపై ఆయన ట్వీట్స్ చేశారు. #GoodMorningCMSir డిజిట‌ల్ క్యాంపెయిన్ జూలై 16, 17 తేదీల్లో కూడా కొన‌సాగ‌నుంది.